జనగామ: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లాలోని మూడు నియోజకవర్గ కేంద్రాల్లో నేడు(బుధవారం) సర్పంచ్‌లు, మున్సిపల్ కౌన్సిలర్లకు ఒక్కరోజు అవగాహన సదస్సులను నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది. పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, విద్యార్థుల నమోదు పెంపు, డ్రాపవుట్ తగ్గింపు, బడిబాటలో ప్రజాప్రతినిధుల పాత్ర వంటి ప్రధాన అంశాలపై ఈ సదస్సుల్లో మార్గదర్శకత్వం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఎంఈఓలు, ఉపాధ్యాయులు గ్రామాల వారీగా మంగళవారం సర్పంచ్‌లు, కౌన్సిలర్లకు ఆహ్వాన పత్రికలు అందజేశారు.
నియోజకవర్గాల వారీగా..
జనగామ నియోజకవర్గానికి సంబంధించిన సదస్సు జిల్లా కేంద్రం సిద్దిపేట రోడ్డులోని శామీర్‌పేట శివారు రమాదేవి ఫంక్షన్ హాల్‌లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాల ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొనాలి. స్టేషన్‌న్‌ఘన్‌పూర్ నియోజకవర్గ సదస్సు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. స్టేషన్ ఘన్‌పూర్, చిల్పూరు, జఫర్‌గఢ్, రఘునాథపల్లి, లింగాలఘణపురం మండలాల సర్పంచ్‌లు, కౌన్సిలర్లు హాజరవ్వాలి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య పాల్గొననున్నారు. పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని సదస్సు దర్థెపల్లి రోడ్డులోని విన్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించనున్నారు. పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల సర్పంచ్‌లు ఈ అవగా హన సమావేశానికి హాజరు కానున్నారు. విద్యారంగం పురోగతి, బడిబాట పటిష్టం, విద్యార్థుల సంఖ్య పెంపు దిశగా ఈ సదస్సులు కీలకంగా ఉపయోగపడతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
నియోజకవర్గస్థాయిలో సర్పంచ్, కౌన్సిలర్లకు అవగాహన
విద్యాప్రగతిలో ప్రజాప్రతినిధుల
భాగస్వామ్యం
‘స్టేషన్’ సదస్సుకు హాజరుకానున్న ఎమ్మెల్యే కడియం, ఎంపీ కావ్య


