జనగామ: జిల్లావ్యాప్తంగా మంగళవారం హనుమాన్ జయంతి భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా జరిగాయి. భక్తులు భారీ సంఖ్యలో ఆలయాలకు చేరుకోగా, అర్చకులు చందన సమర్పణ, 108 తమలపాకులు, వడలతో స్వామి అలంకరణ, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీ మూలభావి శ్రీ హనుమత్ రామనాథ సహిత శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు మోహన్ కృష్ణ భార్గవ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. శ్రీ సంతోషిమాత గణేష్ స్ట్రీట్, గుండ్లగడ్డ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, గీతాశ్రమం, కురుమవాడ, గిర్నిగడ్డ, అంబేద్కర్ నగర్, బాణాపురం సహా పలు ప్రాంతాల ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ, గంగు సాంబమూర్తి శర్మ నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల దీక్ష, అరమండల దీక్షలో భాగంగా నియమ నిష్ఠలతో మాల ధరించిన స్వాములు మాలవిరమణ చేశారు.


