జనగామ: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు పరిధి కాటన్ యార్డులో ఏర్పాటు చేసిన ఐకేపీ, మెప్మా ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద సోమవారం రైతులు ఆందోళనకు దిగారు. రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. వందలాది బస్తాల ధాన్యం తడిసిపోయింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన స్వల్ప వరద ప్రవాహంతో గింజలు కొట్టుకుపోయి నష్టం వాటిల్లింది. ఈ పరిణామాల నేపథ్యంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ఆర్డీఓ గోపిరాం ఐకేపీ, మెప్మా సెంటర్లను సందర్శించారు. రైతుల వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు. నెల రోజుల నుంచి ధాన్యం అమ్ముకోలేక, ఇప్పటికే అమ్మిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆర్డీఓకు ఆవేదన వెళ్లగక్కారు. ఆర్డీఓ వాహనానికి రైతులు అడ్డంగా నిలవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ విఫలమవడంతో పరిశీలన పూర్తిచేసుకుని బయలుదేరే సమయంలో ఆర్డీఓ వాహనాన్ని అడ్డుకున్నారు. సెంటర్ల నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఆర్డీఓ బైక్‌పై వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో తేమశాతం ఎక్కువగా ఉన్న ధాన్యాన్ని మిల్లుకు తీసుకు వెళ్లాలని ఓ లారీ డ్రైవర్‌ను కోరగా, అందుకు ఆయన నిరాకరించారు. తడిసిన ధాన్యం తీసుకెళ్తే రోజుల తరబడి దిగుమతి కావడం లేదని, దీంతో ఈఎంఐలు కట్టలేకపోతున్నామని లారీ డ్రైవర్ అబ్దుల్ బషీర్ లారీ పైకి ఎక్కి ఉరి వేసుకొనేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఓ హమాలీ కార్మికుడు ధైర్యం చేసి డ్రైవర్‌ను కాపాడారు.
తేమ తగ్గి నష్టం పెరిగింది
ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ, సెంటర్లలో పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉందని రైతులు వాపోయారు. 15 నుంచి 30 రోజులుగా కొనుగోలు సెంటర్లలో ధాన్యం పేరుకుపోవడంతో తేమ 8 శాతానికి పడిపోయిందని, తేమ తగ్గుదలతో ఒక్కో రైతుకు భారీ నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే పూర్తిగా దిగుబడి తగ్గిపోయే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తరచుగా వచ్చే గాలివానలు, అడపాదడపా వర్షాలు ధాన్యాన్ని మరింత నష్టపరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రైస్ మిల్లుల్లో కోతలు..
సెంటర్ల నుంచి రైస్ మిల్లులకు తరలించిన ధాన్యంపై అన్యాయమైన కోతలు వేస్తున్నారని రైతులు ఆరోపించారు. చీటకోడూరు రూట్‌లోని సోమేశ్వర రైస్ మిల్లుకు 8శాతంతో ఉన్న ధాన్యం తీసుకెళ్తే తాలు పేరుతో 40 కిలోల వరకు కోత విధించారని రైతు గన్నెబోయిన సారయ్య ఆర్డీఓ ఎదుటే గోడును వెల్లబోసుకున్నాడు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన 10 వేల బస్తాలను తరలించాల్సి ఉండగా, మరో 10 వేల బస్తాలు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయని మెప్మా సెంటర్ ఇన్‌చార్జ్ రేణుక తెలిపారు. కాంటా వేసిన 2,500 బస్తాలను మిల్లులకు తరలించాల్సి ఉండగా, మరో 15 వేల బస్తాలు కళ్లాల్లోనే పేరుకుపోయాయని ఐకేపీ ఇన్‌చార్జ్ అనిత తెలిపారు.
రైతుల కన్నీటి పర్యంతం
రోజువారీ పనులు వదిలి నెల రోజులుగా కొనుగోలు సెంటర్ల వద్దే గడుపుతున్నామని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. వర్షం వస్తే బస్తాలను కిందకు, మీదకు మార్చమని చెప్పి తమను ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. అమ్ముకున్న సరుకు మిల్లుకు వెళ్లే వరకు తమనే కాపలా పెడుతున్నారని మండిపడ్డారు. తమ కష్టానికి విలువ లేదని, తేమ పెరిగిందంటూ మిల్లర్లు కోతలు వేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటర్లలో సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ రైతులకు హామీ ఇచ్చినప్పటికీ, రైతుల ఆవేదన మాత్రం తీరలేదు. జనగామ యార్డులో కొనుగోళ్లు సజావుగా సాగేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలంటూ వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఆర్డీఓ సందర్శన..
వాహనం అడ్డగించిన అన్నదాతలు
కళ్లాల్లో పేరుకుపోయిన వేలాది ధాన్యం బస్తాలు
మిల్లులకు తరలించడంలో జాప్యంతో ఇక్కట్లు


