బడిలో పండగ | - | Sakshi
Sakshi News home page

బడిలో పండగ

May 11 2026 8:44 AM | Updated on May 11 2026 8:44 AM

నేటినుంచి విద్యావారోత్సవాలు ప్రారంభం

జనగామ: విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా నిర్వహిస్తున్న ‘ఎడ్యుకేషన్‌ వీక్‌’ కార్యక్రమాలు నేటి(సోమవారం) నుంచి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు, శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఆదర్శ, కేజీబీవీ, గురుకుల పాఠశాలల్లో ఈ కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి రోజు (మే11) పాఠశాల భవనాలు, తాగునీటి సదుపాయాలు, లైటింగ్‌, బయో టాయిలెట్ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అదే రోజు నుంచి మే 25 వరకు పీఎంశ్రీ, కేజీబీవీ పాఠశాలల్లో సమ్మర్‌ క్యాంపులు నిర్వహించనున్నారు. జిల్లాలో ఉన్నత, ప్రాథమిక, ప్రాథమికోన్నత, గురుకుల పాఠశాలలు సు మారు 600 వరకు ఉండగా, 40వేల మంది పిల్లల వరకు ఉంటారు.

విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలి

సమీక్షలో కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరగబోయే విద్యావారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశించారు. ఈ కార్యక్రమ సన్నాహక ఏర్పాట్లకు సంబంధించి ఆదివారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో కలెక్టర్‌, విద్యాశాఖాధికారి సందీప్‌ కుమార్‌ ఝా ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో విద్యాశాఖ భాగస్వామ్యం కీలకమన్నారు. పీఎం శ్రీ స్కూల్స్‌లో 15 రోజుల పాటు ఆర్ట్స్‌, కల్చరల్‌, డాన్స్‌ మ్యూజిక్‌ తదితర రంగాలలో పిల్లలకు సమ్మర్‌ కోచింగ్‌ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు పెరిగేలా వారి సహకారాన్ని తీసుకోవాలన్నారు. 10వ తరగతిలో ఫెయిల్‌ అయిన ప్రభుత్వ, ప్రయివేట్‌ విద్యార్థులకు కోసం జిల్లా కేంద్రంలోని ధర్మకంచ ప్రభు త్వ ఉన్నత పాఠశాల, దేవరుప్పుల మండలం కామారెడ్డి గూడెంలో ఏ ర్పాటు చేసిన ప్రత్యేక తరగతుల శిబిరంలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు అయ్యేంత వరకు సబ్జెక్ట్‌ల వారీగా సులభమైన పద్ధతుల ద్వారా బోధన చేయాలన్నారు. జున్‌ 2వ తేదీన జరిగే బడిబాట కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో సర్పంచ్‌ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి విద్యార్థుల నమోదు గణనీయంగా పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా వారోత్సవాల ముగింపు సమావేశంలో 10వ తరగతి, ఇంటర్‌ ఫలితాల్లో టాప్‌ 3 సాధించిన విద్యార్థులకు, జిల్లా స్థాయి క్రీడల్లో ప్రతిభ చూపిన ముగ్గురికి రూ.10 వేల నగదు పురస్కరంతో పాటు సన్మానం చేయాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ రెవెన్యూ బెన్‌ షాలోమ్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఏసీపీ భీంశర్మ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌, డీఐఈఓ జితేంద్ర కుమార్‌, విద్యాశాఖ కార్యాలయ ఏడీ శ్రీనివాస్‌, జీసీడీఓ గౌసియా బేగం ఉన్నారు.

రోజు వారీ కార్యక్రమాలు

11వ తేదీ: తొలి రోజు ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్‌ భవనాలు, తాగునీటి సదుపాయాలు, లైటింగ్‌, బయోటాయిలెట్ల పరిశుభ్రతపై అధికారులు సమీక్ష నిర్వ హిస్తారు. పీఎంశ్రీ, కేజీబీవీల్లో మే 25 వరకు సమ్మర్‌ క్యాంపులు నిర్వహించాలి. ఈ శిబిరాల్లో విద్యార్థులకు డ్రాయింగ్‌, యోగా, క్రీడలు, కళలు, వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

12వ తేదీ: జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి విద్యార్థుల కోసం రిమీడియల్‌ క్యాంపులు నిర్వహించాలి. పరీక్షల్లో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణతో పాటు పిల్లల సందేహాలకు నివృత్తి చేయాలి. విద్యార్థులకు సబ్జెక్ట్‌ వారీగా ప్రత్యేక సూచనలు ఇస్తారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

13వ తేదీ: మూడో రోజు సర్పంచులు, ప్రజాప్రతినిధులతో విద్యాభివృద్ధిపై ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, విద్యార్థుల నమోదు పెంపు, డ్రాపవుట్‌ తగ్గింపు వంటి అంశాలపై చర్చించాలి.

14వ తేదీ: బడిబాట కార్యక్రమంతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు (పీటీఎం) నిర్వహించనున్నారు. విద్యార్థుల హాజరు, చదువులో పురోగతి, పాఠశాల అవసరాలపై తల్లిదండ్రులతో చర్చించనున్నారు. కొత్త అడ్మిషన్ల కోసం ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలను పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

15వ తేదీ: లైబ్రరీ–ది హార్ట్‌ ఆఫ్‌ నాలెడ్జ్‌ పేరుతో పాఠశాలల్లో పుస్తక ప్రదర్శనలు, బుక్‌టాక్స్‌, డిజిటల్‌ క్లాస్‌రూమ్‌ ప్రదర్శనలు నిర్వహిస్తారు. విద్యార్థుల్లో పఠనాభిరుచి పెంపొందించేందుకు పుస్తకాల ప్రాధాన్యంపై అవగాహన కల్పించనున్నారు.

16వ తేదీ: విద్యార్థుల ప్రతిభాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ క్రీడాభిరుచి డే నిర్వహించనున్నారు. కళలు, క్రీడలు, యోగా, కరాటే, సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొననున్నారు.

17వ తేదీ: వారం రోజుల పాటు సాగిన ‘ఎడ్యుకేషన్‌ వీక్‌’ కార్యక్రమాలు విద్యా విజయోత్సవంతో ముగుస్తాయి. 10వ తరగతి, ఇంటర్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రంగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించనున్నారు.

సర్వం సిద్ధం చేసిన విద్యాశాఖ

బడిబాటతో అడ్మిషన్ల పెంపునకు ఊతం

విద్యా ప్రమాణాలకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

వేడుకలపై కలెక్టర్‌ ప్రత్యేక ఫోకస్‌

Advertisement
 
Advertisement
Advertisement