సాక్షి, వరంగల్/గీసుకొండ: కేంద్రం ఆలోచనలకు అనుగుణంగా 5ఎఫ్ (ఫామ్ టు ఫైబర్.. టు ఫ్యాక్టరీ.. టు ఫ్యాషన్...టు ఫారిన్) దృక్కోణంతో ఓరుగల్లు ఖ్యాతి ప్రపంచానికి తెలిసేలా మరో అడుగు ముందుకు పడింది. పత్తి ఉత్పత్తి నుంచి అంతర్జాతీయ ఎగుమతుల దాకా ఒకే వేదికపై పూర్తి విలువ వ్యవస్థను కల్పించేలా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును పీఎం మిత్ర (ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అపెరల్ పార్కు) పథకం కింద 2023లో ఎంపిక చేశారు. ఈ మేరకు రూ.200 కోట్లతో కూడిన అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వేదికగా ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఇప్పటికే విడుదల చేసిన రూ.30 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టగా, మరో రూ.170 కోట్ల దఫాల వారీగా కేంద్రం రాష్ట్రానికి అందివ్వనుంది. దీంతో పాటు ‘కాంపిటిటివ్ ఇన్సెంటివ్ సపోర్ట్’ కింద రూ.300 కోట్ల వరకు ప్రోత్సాహక మద్దతు ఇవ్వనుండడంతో దేశ, విదేశీ కంపెనీలు ఇక్కడికి క్యూ కట్టే అవకాశం ఉంది. గీసుకొండ, సంగెం మండలాల్లోని శాయంపేట హవేలీలో మొత్తం 1,327 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ పార్కులో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.1695.54 కోట్ల వ్యయం కాగా, వివిధ మార్గాల ద్వారా రూ.6,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ పార్కు ద్వారా 24,400కు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ప్రారంభోత్సవాన్ని వీక్షించిన కలెక్టర్, అధికారులు
పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును పీఎం మోదీ హైదరాబాద్‌లో వర్చ్‌వల్‌గా ప్రారంభించగా ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా కలెక్టర్ సత్యశారద, అధికారులు పార్కు వద్ద వీక్షించారు. ఈ సందర్భంగా టీజీఐఐసీ జోన్ మేనేజర్ స్వామినాయక్ మాట్లాడుతూ కేఎంటీపీ నిర్మాణానికి రూ.1,695 కోట్లను అంచనా వేశారని, వాటిలో సుమారు రూ. 800–900 కోట్ల వరకు పలు అభివృద్ధి పనులు, సదుపాయాల పనులతో పాటు భూ సేకరణ పనులకు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.
పత్తి ఉత్పత్తి నుంచి అంతర్జాతీయ
ఎగుమతులు ఒకే వేదికపై..
కేఎంటీపీకి పీఎం మిత్ర కింద రూ.200 కోట్లు, సీఐఎస్ కింద రూ.300 కోట్లు
వర్చువల్‌గా హైదరాబాద్ నుంచి ప్రారంభించిన పీఎం నరేంద్రమోదీ


