జనగామ: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం రైతులకు తీవ్ర నిరాశ మిగి ల్చింది. ప్రభుత్వ ధాన్యం సెంటర్లలో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వందలాది బస్తాల ధాన్యం నీటిలో తడిసి రైతులు నష్టాన్ని చవిచూశారు. జనగామ వ్యవసాయ మార్కెట్ పరిధిలోని కాటన్ యార్డుల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ, మెప్మా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేలాది బస్తాల ధాన్యం గింజలు రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు నిలిచిపోయాయి. కొనుగోళ్లలో ఆలస్యం కావడంతో రైతులు తమ బస్తాలను కంటికి రెప్పలా కాపాడేందుకు సెంటర్ల వద్ద రాత్రింబవళ్లు ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆకస్మికంగా కురిసిన ఆకాల వర్షం రైతుల కష్టాలను రెట్టింపు చేసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన స్వల్ప వరదతో గింజలు కొట్టుకుపోయి నేలపాలయ్యాయి. వరదలో చిక్కుకున్న ధాన్యాన్ని రక్షించుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. అయితే ముందస్తు జాగ్రత్తగా కొంతమంది రైతులు టార్పాలిన్ కవర్లు కప్పుకోవటంతో నష్టం తప్పింది. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, తక్షణమే షిఫ్ట్ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు.
పలు గ్రామాల్లో..
జనగామ రూరల్: మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో స్వల్పంగా ధాన్యం తడిసింది. రోజలు తరబడి కోనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం నిల్వలుఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కాటన్ యార్డు సెంటర్లలో
తడిసిన ధాన్యం
నీటిలో మునిగిన ధాన్యం..
కొట్టుకుపోయిన గింజలు
కొనుగోళ్లలో వేగం పెంచాలని
రైతుల వేడుకోలు


