జనగామ రూరల్: కొనుగోలు అయిన ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం జనగామ మండలంలోని వడ్లకొండ రోడ్, నర్మెట మండలంలోని హనుమంతపూర్, అనంతరం తరిగొప్పుల, చిల్పూర్ మండలంలోని శ్రీపతిపల్లి, లింగంపల్లి, వెంకటాద్రిపేట, మల్కాపూర్, చిల్పూర్‌గుట్టలలో పర్యటించి అక్కడ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని నిర్వహకులకు కలెక్టర్ స్పష్టం చేశారు.
మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించాలి
జిల్లాలో యాసంగి మార్కెటింగ్ సీజన్ 2025–26లో వరి కొనుగోలు ప్రక్రియ సందర్భంగా రైతులు, రవాణాదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్, మేజిస్ట్రేట్ సందీప్ కుమార్ ఝా సుమోటోగా స్పందించి జిల్లాలోని సీఎంఆర్ కేటాయింపు పొందిన రైస్ మిల్లర్లకు ప్రాథమిక షరతులతో కూడిన ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీ మిత్ర ఆగ్రో ఇండస్ట్రీస్, చిన్నరాంచర్ల, బచ్చన్నపేట మండలం, అలాగే సోమేశ్వర ఇండస్ట్రీస్, చీటకోడూరు, జనగామ మండలం, రెండు మిల్లులపై చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. కొనుగోలు ప్రారంభమై 20 రోజులు గడిచినా, కొన్ని రైస్ మిల్లుల వద్ద వరి అన్‌లోడింగ్ ప్రక్రియ మందగించడంతో కొనుగోలు కేంద్రాల్లో వరి నిల్వలు పెరిగాయన్నారు.
తరలింపును వేగవంతం చేయాలి
చిల్పూరు: రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లతో పాటు తరలింపును వేగవంతం చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. మండలంలోని శ్రీపతిపల్లి గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏడీఆర్, డీఓ, ఐకేపీ ఏపీఎం పిట్టల నరేందర్, ఎంఏఓ నజీరుద్ధీన్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


