ప్రేమ మూర్తి.. అమ్మ కీర్తి | - | Sakshi
Sakshi News home page

ప్రేమ మూర్తి.. అమ్మ కీర్తి

May 10 2026 7:58 AM | Updated on May 10 2026 7:58 AM

భర్త లేకపోయినా బాధ్యత నెరవేర్చింది కుటుంబం, ఉద్యోగం.. రెండింటిలోనూ సక్సెస్‌ పెళ్లి తర్వాత కూడా చదువు ఆపలేదు..

మహిళలకు స్ఫూర్తి.. మాలతి

అమ్మ ప్రేమ అనంతం అన్నీ తామై పెంచుతున్న తల్లులు

అనాథలకు

అమ్మ

తాను ఎలా ఉన్నా పిల్లలను ఉన్నతంగా చూడాలనుకుంటుంది. పస్తులుండైనా కన్నవారి కడుపు నింపాలనుకుంటుంది. కష్టాల కడలిని ఎదురీదైనా పిల్లల భవిష్యత్‌కు బాటలు వేయాలనుకుంటుంది. కుటుంబ పెద్ద మరణించినా అన్నీ తానై నడిపిస్తుంది. ఉమ్మడి జిల్లాలో అనాథలకు ప్రేమను పంచుతున్న వారు ఒకరైతే.. భర్తలేకపోయినా పెంచి పెద్ద చేసిన వారు మరొకరు. ఇలా ఆదర్శంగా నిలుస్తున్న వారెందరో.. అలాంటి దైవాల ప్రేమకు అక్షర రూపమిస్తూ.. నేడు(ఆదివారం) మాతృ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ సండే స్పెషల్‌ స్టోరీ.

జఫర్‌గఢ్‌: వందలాది మంది అనాథ పిల్లలతో అమ్మ అని ఆప్యాయంగా పిలుపించుకుంటున్నారు ‘మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకులు గాదె పుష్పరాణి. మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీతండా వద్ద గాదె ఇన్నయ్య 20 ఏళ్ల క్రితం ‘మా ఇల్లు’ ప్రజాదరణ అనాథ ఆశ్రమాన్ని స్థాపించారు. 32 మంది పిల్లలతో ప్రారంభించిన ఈ ఆశ్రమంలో ఇప్పటి వరకు వందకు పైగా అనాథ పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. ఆశ్రమంలోని ఆడపిల్లల విషయంలో ఆమె ప్రత్యేక శ్రద్ధవహిస్తూ తల్లిదండ్రులు లేని లోటు తీరుస్తున్నారు. ఆశ్రమానికి చెందిన ముగ్గురు ఆడపిల్లలకు సొంత ఖర్చులతో వివాహాలు జరిపించారు. పుష్పరాణి కృషి ఫలితంగా ఆశ్రమానికి చెందిన పిల్లలు లాయర్లు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, నర్సులు, ఉపాధ్యాయులు, కానిస్టేబుల్‌గా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా గాదె పుష్పరాణి మాట్లాడుతూ.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది అనాథ పిల్లలకు అమ్మలా సేవ చేయడం, వారితో అమ్మ అని పిలిపించుకోవడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు.

జనగామ: జనగామ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు బి.మాలతి. చిన్నప్పటి నుంచే తన తండ్రి తనను ఉద్యోగస్తురాలిగా చూడాలని కలలు కన్నారు. ఆ ఆశయం నెరవేర్చేందుకు బీటెక్‌ చదివి కష్టపడి ఉద్యోగం సాధించారు. భర్త వెంకటేష్‌ సపోర్ట్‌ చేస్తుండడంతో పెళ్లయిన తర్వాత కూడా ఉద్యోగంలో రాణిస్తున్నానని చెప్పారు. ఇంటికెళ్తే పిల్లలు ‘మమ్మీ’ అంటే తన అలసట తీరిపోతుందంటున్నారు. ఉద్యోగం, కుటుంబాన్ని సమన్వయం చేసుకుంటున్నానని చెప్పారు.

తల్లి సరోజనతో సీఐ శ్రీనివాస్‌రెడ్డి

కుటుంబ పెద్ద లేకపోయినా పెంచి పెద్ద చేస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్న ఉమ్మడి జిల్లా మాతృమూర్తులు

బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన గూడ లావణ్య – కీ.శే. భూపాల్‌రెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు అపూర్వ, కుమారుడు అశ్విష్‌రెడ్డి. కూతురు బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతుండగా లావణ్య భర్త భూపాల్‌రెడ్డి ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌తో మృతి చెందాడు. ఆ కుటుంబం అంతా దుఖసాగరంలో మునిగిపోయింది. అయినప్పటికీ, తల్లి లావణ్య దిగులు పడకుండా తన పిల్లలను చదివించింది. అపూర్వ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ పట్టుదలతో చదివి ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చేర్యాల పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓగా పని చేస్తున్నారు. కష్టాలు, కన్నీళ్లు ఎన్ని ఎదురైనా మనోధైర్యం, గుండె నిబ్బరం వీడకుండా ముందుకు సాగాలని, తన తల్లే తనకు ఆదర్శమని ఎస్సై అపూర్వరెడ్డి చెబుతున్నారు.

జనగామ: జనగామ మున్సిపల్‌ కార్యాలయంలో 1992 నుంచి పెన్షన్‌ సెక్షన్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు పులి విజయలక్ష్మి. తండ్రి వారసత్వంగా వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని దైవ ప్రసాదంలా భావించి 34 ఏళ్లుగా నిబద్ధతతో సేవ చేస్తున్నారు. ఒక పక్క ఉద్యోగం.. మరో పక్క కుటుంబం.. ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లతో పెద్దకుటుంబం నడిపేటప్పుడు ఎన్నో సవాళ్లు ఎదురైనా సమయం, క్రమశిక్షణ పాటించి రెండింటిలోనూ సక్సెస్‌ సాధించానని చెబుతున్నారు. తన ప్రయాణంలో అండగా నిలిచిన భర్త నర్సింగరావే తన బలమంటున్నారు.

రఘునాథపల్లి: మా అమ్మ ఎడవెల్లి సరోజన కష్టాలు బయటపె ట్టకుండా, మా కుటుంబం కోసం నిశ్శబ్ద పోరాటం చేసిన మహానుబావురాలు. చిన్నతనంలో చేయిపట్టి నడిపించింది. ఇప్పటికీ ఆమె ప్రేమే నన్ను ముందుకు నడిపిస్తోంది. నేనీ స్థాయిలో ఉన్నానంటే విలువలు, క్రమశిక్షణతో జీవనం కొనసాగిస్తున్నానంటే అమ్మ మార్గదర్శనంతోనే. నా ప్రతీ అడుగులో అమ్మ ప్రోత్సాహం ఉంది. తల్లులందరికీ శుభాకాంక్షలు.

జనగామ: పెళ్లి తర్వాత కూడా తన చదువు, లక్ష్యం ఆగిపోలేదని అంటున్నారు జనగామ తహసీల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వి.స్వాతి. కుటుంబం ఇచ్చిన నమ్మకం, భర్త శ్రీధర్‌ (జూనియర్‌ లెక్చరర్‌) ఇచ్చిన ప్రోత్సాహంతో పోటీ పరీక్షలకు సిద్ధమై ఉద్యోగం సంపాదించానని చెప్పారు. ఒక కూతురు, బాబు ఉన్నారని, అటు ఉద్యోగం, ఇటు కుటుంబం రెండింటిని సమతుల్యం చేసుకోవడమే తన నిజమైన విజయం అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement