స్టేషన్ ఘన్‌పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్యను పరిష్కరించేలా ప్రత్యేక చొరవతో పనిచేస్తానని మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని తాగునీటి సరఫరా సమస్యలపై ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల నుంచి పలువురు నీటి సమస్యపై విన్నవించగా అందుకు మున్సిపల్ చైర్మన్ సానుకూలంగా స్పందించారు. ప్రధానంగా రెండు, మూడు రోజులకు ఒకసారి నీటి సరఫరా చేస్తున్నారని, పలు ఏరియాల్లో కలుషిత, మురుగునీరు వస్తోందని, పైప్‌లైన్‌ల లీకేజీలు, గేట్‌వాల్వ్‌లు, మిషన్ భగీరథ నల్లాలకు ఆన్‌ఆఫ్ ఏర్పాటు చేయాలని, బోర్‌లను మరమ్మతు చేయించాలని, వాటర్ ట్యాంక్‌లను శుభ్రం చేయించాలని తదితర అంశాలను పలువురు ప్రస్తావించారు. కాగా ప్రధానంగా 17వ వార్డు నుంచి ఎక్కువగా సమస్యలు వెల్లువెత్తాయి.
ప్రశ్న: నల్లాలు వదిలిన సమయంలో మొదట 5 నిమిషాలు నల్లాల ద్వారా మురుగునీరు వస్తున్నాయి. పైప్‌లైన్‌ల లీకేజీలతో సమస్యగా ఉంది..
– సాంబారి సత్యనారాయణ, 12వ వార్డు
మున్సిపల్ చైర్మన్: మున్సిపాలిటీలో పైప్‌లైన్ల లీకేజీపై ప్రత్యేక దృష్టి సారించాం. వాటర్‌మెన్‌లతో మాట్లాడి లీకేజీలపై ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరిస్తాం.
ప్రశ్న: సమయపాలన లేకుండా నీటి సరఫరా చేస్తున్నారు. ఇళ్లలో అందరూ పనికి వెళ్లాక మధ్యాహ్నం సమయంలో నీటి సరఫరా చేస్తున్నారు. ఉదయమైనా, సాయంత్రమైనా నిర్ణీత సమయానికి నీటి సరఫరా చేయాలి..
– కుసుమ సాంబశివ,
బోడ వేద ప్రకాష్, 15వ వార్డు
చైర్మన్: మిషన్ భగీరథ వారు మన వాటర్ ట్యాంకులకు మధ్యాహ్నం వేళల్లో నీటిని అందిస్తున్నారు. అందుకే నీటి సరఫరా సమయంలో సమస్యగా ఉంది. ఈ విషయమై మిషన్ భగీరథ, మున్సిపాలిటీ వారితో చర్చించి సమయం ప్రకారం నీటిని అందించేలా చర్యలు తీసుకుంటాం.
ప్రశ్న: వాటర్ ట్యాంకులను శుభ్రం చేయడం లేదు. పద్మశాలీ కాలనీలో ట్యాంకు పాకురుపట్టి ఉంది. దాంతో నల్లాల ద్వారా కలుషిత నీరు వస్తోంది..
– చిలగాని శ్రీధర్, 2వ వార్డు
చైర్మన్: ట్యాంకులన్నింటినీ శుభ్రం చేయించి బ్లీచింగ్ చేయిస్తాం.
ప్రశ్న: నీటి సమస్య తీవ్రంగా ఉంది. పైప్‌లైన్ వేసి గేట్‌వాల్వ్ ఏర్పాటు చేయలేదు. నాలుగైదు రోజులుకు ఒకసారి నీరు వస్తున్నాయి. వాటర్‌ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలి.
– దాసరి పరశురాములు, ఎల్లావుల ఉపేంద్ర, సీహెచ్.కనకతార 17వ వార్డు, గుర్రం ఫాతికుమార్, 2వ వార్డు, –పెసరు మలేంద్ర, 17వ వార్డు
చైర్మన్: 17వ వార్డులో నీటి సరఫరా సమస్య ఉన్నది వాస్తవమే. అభివృద్ధి పనుల్లో భాగంగా పాత ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న వాటర్‌ట్యాంక్‌ను తొలగించాం. దాంతో నీటి సమస్య ఉంది. పైప్‌లైన్‌లకు అవసరమైన చోట గేట్‌వాల్వ్‌లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతానికి వాటర్‌ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తాం.
ప్రశ్న: మిషన్ భగీరథ నల్లాలకు ఆన్‌ఆఫ్‌లు లేకపోవడంతో పలుచోట్ల నీరు వృథాగా పోతోంది. నల్లాలకు ఆన్‌ఆఫ్‌లు ఏర్పాటు చేస్తే బావుంటుంది..
–బంగ్లా శ్రీను 16వ వార్డు,
పోశాల కృష్ణమూర్తి, 2వ వార్డు
చైర్మన్: నీటి వృథాను అరికట్టేందుకు తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఈ క్రమంలోనే పైప్‌లైన్ల లీకేజీల మరమ్మతులు చేయించాం..
ప్రశ్న: వాటర్ ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేస్తే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఽఘన్‌పూర్‌లో రిజర్వాయర్ ఉన్నందున ధర్మసాగర్ మాదిరిగా ఇక్కడ వాటర్ ఫిల్టర్‌బెడ్ ఏర్పాటు చేయించాలి
– నీల సోమన్న, 11వ వార్డు
చైర్మన్: వాటర్ ఫిల్టర్‌బెడ్ నిర్మాణ విషయాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్తా. నీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పనిచేస్తా.
ప్రశ్న: డ్రైనేజీలలో గేట్‌వాల్వ్‌లు ఉండటంతో నల్లాల ద్వారా మురుగునీరు వస్తోంది. సమస్యను పరిష్కరించాలి..
– గుర్రం సురేష్ 3వ వార్డు
చైర్మన్: మున్సిపాలిటీ పరిధిలోని డ్రైనేజీల వద్ద ఉన్న గేట్‌వాల్వ్‌ల విషయమై మున్సిపాలిటీ నీటిసరఫరా సిబ్బందితో చర్చిస్తా. సమస్యను శాశ్వతంగా పరిష్కరించి పరిశుభ్రమైన నీటిని అందిస్తా.
ప్రశ్న: వీవర్స్‌కాలనీ సమీప న్యూ ముదిరాజ్ కాలనీలో వాటర్ ట్యాంకుకు మిషన్ భగీరథ నీరు రావడం లేదు. పైప్‌లైన్ వేసి ఒకటే గేట్‌వాల్వ్ ఏర్పాటు చేయడంతో పాలిటెక్నిక్ కళాశాలకు మొత్తం నీరు వెళ్తున్నాయి. దాంతో కాలనీలో మిషన్ భగీరథ నీరు రావడం లేదు..
– కొండ రవి, 3వ వార్డు
చైర్మన్: సమస్యను స్వయంగా పరిశీలించి వాటర్ ట్యాంక్‌కు మిషన్ భగీరథ నీరు అందించేలా కృషి చేస్తా. అవసరమైన చోట మరో గేట్‌వాల్వ్ ఏర్పాటు చేసి అటు పాలిటెక్నిక్ కళాశాలకు, ఇటు కాలనీకి నీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటాం.
ప్రశ్న: నీటి సమస్య తీవ్రంగా ఉంది. కాలనీలోని బో ర్లు, చేతిపంపులను మరమ్మతు చేయించాలి. కాలనీలో నూతన వాటర్ ట్యాంకు ఏర్పాటు చేయించాలి..
– పండుగ అశోక్, కుంభం నరేష్,
పిట్టల మల్లేష్, 17వ వార్డు
చైర్మన్: 17వ వార్డులో పైప్‌లైన్, గేట్‌వాల్వ్ సమస్యను పరిష్కరిస్తాం. కాలనీలో చెడిపోయిన చేతిపంపులను, బోర్లను త్వరలో మరమ్మతులు చేయించి నీటి సమస్యను పరిష్కరిస్తాం. అవసరమైతే కాలనీకి ప్రత్యేకంగా వాటర్ ట్యాంక్ నిర్మా ణం చేసేలా చర్యలు తీసుకుంటా.
మున్సిపాలిటీలో ప్రతీ రోజు నీరందించేందుకు కృషి చేస్తా..
పైప్‌లైన్ లీకేజీలు, గేట్‌వాల్వ్ తదితర మరమ్మతు పనులు చేయిస్తా..
స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్
‘సాక్షి ఫోన్ ఇన్’ కార్యక్రమానికి విశేష స్పందన


