నేటితో స్వీయగణనకు చివరి రోజు | - | Sakshi
Sakshi News home page

నేటితో స్వీయగణనకు చివరి రోజు

May 10 2026 7:58 AM | Updated on May 10 2026 7:58 AM

జనగామ: జనగణన–2027లో భాగంగా ప్రభుత్వం అందించిన స్వీయగణన (సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌) అవకాశం నేటి(ఆదివారం)తో ముగియనుండటంతో ప్రతీ కుటుంబం తప్పనిసరిగా నమోదు పూర్తి చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత, కుటుంబ వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుకుంటూ, కేవలం 5 నుంచి 7 నిమిషాల్లోనే స్వయంగా నమోదు చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉందని తెలిపారు. ఒక మొబైల్‌ నంబర్‌తో ఒక కుటుంబం మాత్రమే నమోదు చేయగలరని, ఓటీపీ ఆధారంగా ధ్రువీకరణ జరుగుతుందని చెప్పారు. జిల్లా, పిన్‌ కోడ్‌, గ్రామం, పట్టణ వివరాలు ఇచ్చిన తర్వాత మ్యాప్‌లో ఇంటి స్థానం సరిగా గుర్తించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఇంటి, కుటుంబ సభ్యుల వివరాలు, సౌకర్యాలు, ఆస్తుల సమాచారం నమో దు చేసిన తర్వాత ప్రివ్యూ చూసి సబిమిట్‌ చేయాలని సూచించారు. ఒకసారి సమర్పించిన తర్వాత మార్పులు సాధ్యం కాదని స్పష్టం చేశారు. నమోదు పూర్తయ్యాక 11 అంకెల ఎస్‌ఈ ఐడీ లభిస్తుందని, ఎన్యుమరేటర్‌ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఎస్‌ఈ ఐడీ నంబర్‌ చూ పించాల్సి ఉంటుందన్నారు. వివరాలు సరిపో తే నమోదు ఫైనల్‌ అవుతుందని, లేనిపక్షంలో ఎన్యుమరేటర్‌ తిరిగి సమాచారం నమోదు చేస్తారన్నారు. నమోదు కోసం se.census .gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలన్నారు.

డాక్టర్ల సమస్యలు

పరిష్కరించాలి

హన్మకొండ: ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ (పల్లె దవాఖానా)లలో పనిచేస్తున్న డాక్టర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ మహేందర్‌ రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బి.శ్రీనివాస్‌ కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిని అసోషియేషన్‌ ప్రతినిధులు కలిసి సమస్యలు విన్నవించారు. అనంతరం మంత్రిని సన్మానించారు. డాక్టర్లు వెంకటేశ్‌, శివశంకర్‌, అనుపచంద్‌, ఆశాజ్యోతి, స్వప్న, సంగీత, సుష్మ, భార్గవి, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

జూడో శిక్షణ కేంద్రం

ప్రారంభం

వరంగల్‌ స్పోర్ట్స్‌: హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియం ఆవరణలో ఉన్న మినీ ఇండోర్‌ స్టేడియంలో శనివారం శాశ్వత జూడో శిక్షణ కేంద్రాన్ని తెలంగాణ జూడో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బైరబోయిన కై లాశ్‌యాదవ్‌, డీవైఎస్‌ఓ కొత్త ప్రశాంత్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీవైఎస్‌ఓ ప్రశాంత్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని క్రీడలకు ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. కై లాశ్‌యాదవ్‌ మాట్లాడుతూ జూడో శిక్షణ నిరంతరం అందేలా సహకరించిన డీవైఎస్‌ఓ ప్రశాంత్‌కు ధన్యవాదాలు తెలిపారు. హ్యాండ్‌బాల్‌ కోచ్‌ బొడ్డు విష్ణువర్ధన్‌, స్విమ్మింగ్‌ కోచ్‌ రాయబారపు నవీన్‌, బ్యాడ్మింటన్‌ కోచ్‌ కూరపాటి రమేశ్‌, తైక్వాండో కోచ్‌ వెంకటస్వామి, సీనియర్‌ జూడో కోచ్‌లు నాయకపు నాగరాజు, దామెర నక్షత్ర పాల్గొన్నారు.

పారా టేబుల్‌ టెన్నిస్‌

అసోసియేషన్‌ కమిటీ

వరంగల్‌ స్పోర్ట్స్‌: హనుమకొండ సుబేదారిలోని ప్రభుత్వ దివ్యాంగుల వసతి గృహంలో తెలంగాణ పారా టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ కమిటీని ఎన్నుకున్నారు. పారా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు గాడిపెల్లి ప్రశాంత్‌ అధ్యక్షతన శనివారం జరిగిన దివ్యాంగ క్రీడాకారుల సమావేశంలో కార్యవర్గాన్ని ప్రకటించారు. అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శిగా ముప్పిడి రాజుకుమార్‌, సలహాదారుగా సింగారపు బాబు, ప్రెసిడెంట్‌గా నిషా ఇన్ననీ, నిర్వహణ కార్యదర్శిగా సీవీ జగన్నాథరావు, వైస్‌ ప్రెసిడెంట్లుగా బొట్ల కార్తీక్‌, దామెర మనీందర్‌, కోశాధికారిగా బల్లె రాజు ఎన్నికైనట్లు ప్రశాంత్‌ తెలిపారు. తమకు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ, పారా ఒలింపిక్స్‌ కమిటీ, ఖేలో ఇండియా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement