బడిబాట పట్టాలి! | - | Sakshi
Sakshi News home page

బడిబాట పట్టాలి!

May 9 2026 7:44 AM | Updated on May 9 2026 7:44 AM

జనగామ: జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను గణనీయంగా పెంచాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశించారు. 2026–27 విద్యా సంవత్సరానికి ముందుగానే ప్రవేశాల పెంపుపై సమగ్ర కార్యాచరణను సిద్ధం చేస్తూ, ప్రతీ పాఠశాలకు స్పష్టమైన లక్ష్యాలు కేటాయించారు. గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ, మోడల్‌ స్కూల్స్‌, ఎయిడెడ్‌ పాఠశాలలు, అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఎంత మంది ప్రవేశం పొందారు? ఈ సంవత్సరం కనీసం ఎంత పెంపు చేయాలి? అనే దానిపై స్కూల్స్‌, గురుకులాల వారీగా లక్ష్యాలు నిర్ధారించారు. తల్లిదండ్రుల్లో విశ్వాసం పెంపొందించేందుకు విద్యాశాఖతో కలిసి ప్రగతిశీల కార్యక్రమాలు చేపట్టాలని, బోధన నాణ్యత, పాఠశాలల వసతులు, మౌలిక సదుపాయాలు, శుభ్రత, డిజిటల్‌ క్లాస్‌ రూంల వినియోగం, విద్యార్థుల హాజరు శాతం పెంపుపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్‌ సూచించారు. అధికారులు, హెడ్‌మాస్టర్లు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరగడమే కాకుండా విద్యా నాణ్యత కూడా మెరుగవుతుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న విద్యా సౌకర్యాలను సమర్థంగా వివరించి ప్రతీ పాఠశాల నిర్దేశిత లక్ష్యాన్ని తప్పనిసరిగా చేరుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల పెంపు లక్ష్యంగా జిల్లాలోని అన్ని మండల విద్యా అధికారులు (ఎంఈఓలు), హెడ్‌మాస్టర్లు ప్రవేశాల పెంపు లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని ఆదేశించారు. ప్రత్యేకంగా జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో బోధన నాణ్యత, భద్రత, మౌలిక సదుపాయాలు, ఇంగ్లిష్‌ మీడియం వంటి అంశాలు విద్యార్థుల ఆకర్షణకు ప్రధాన బలంగా అవుతున్నాయని సూచనలు చేశారు. ఎంఈఓలకు అప్పగించిన లక్ష్యాలు, పర్యవేక్షణను కచ్చితంగా నిర్వహించాల్సి ఉంటుంది. హెచ్‌ఎంలు తమ పాఠశాలలకు కేటాయించిన లక్ష్యాలను 100 శాతం చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మౌలిక వసతులు–ప్రభుత్వ పాఠశాలల బలం

ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను తల్లిదండ్రులకు వివరించాలని అధికారులు పాఠశాలల యాజమాన్యానికి సూచించారు. మెరుగైన తరగతి గదులు బాలురు, బాలికలకు ప్రత్యేక టాయిలెట్స్‌, స్వచ్ఛమైన నీరు, విద్యుత్‌, డిజిటల్‌ లెర్నింగ్‌ సదుపాయాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, ఈ సదు పాయాలు ప్రభుత్వ పాఠశాలల విశ్వసనీయతను పెంచడంలో కీలకమని పేర్కొన్నారు.

విద్యార్థుల–తల్లిదండ్రుల అవసరాలకు

ప్రాధాన్యం

తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటూ, వారి నమ్మకాన్ని పెంపొందించడానికి హెచ్‌ఎంలు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. నాణ్యమైన బోధన, రోజువారీ హాజరు పర్యవేక్షణ, సహ పాఠ్యాతేర కార్యక్రమాలు, కమ్యూనికేషన్‌ నైపుణ్యాల అభివృద్ధి, డిజిటల్‌ లెర్నింగ్‌ వినియోగం వంటి అంశాలు ప్రవేశాల పెంపునకు దోహదం చేయనున్నాయి. డ్రాపౌట్‌ల నియంత్రణపై దృష్టి సారించి ఎంఈఓలు ప్రతీ వారం పాఠశాల వారీగా అడ్మిషన్ల పురోగతిని పరిశీలించి జిల్లా విద్యాధికారి కార్యాలయానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. హెడ్‌మాస్టర్లు రోజువారీ నమోదు వివరాలు నిర్వహించాలి. డ్రాపౌట్లను పూర్తిగా తగ్గించడం, గత విద్యార్థుల తల్లిదండ్రులతో ఫీల్డ్‌ విజిట్లు చేయడం వంటి చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రతీ పాఠశాలకు లక్ష్యాలు నిర్దేశించి, వాటిని తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్‌ సూచించడంతో, ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య భారీగా పెరగనున్నట్లు విద్యాశాఖ అంచనా వేస్తోంది.

ప్రభుత్వ పాఠశాలల్లో

అడ్మిషన్లు పెంచాలని కలెక్టర్‌ ఆదేశం

2026–27 విద్యా సంవత్సరానికి 100శాతం చేరికలే లక్ష్యం

ఎంఈఓ, హెచ్‌ఎంలకు ప్రత్యేక బాధ్యతలు

డ్రాపౌట్‌ నివారణపై దృష్టి

మండలం సూల్స్‌ పిల్లల బడిబాట పెరిగితే

సంఖ్య టార్గెట్‌ పిల్లల సంఖ్య

బచ్చన్నపేట 41 3,003 1,181 4,184

చిల్పూరు 36 1,992 718 2,710

దేవరుప్పుల 49 2,053 914 2,967

స్టే.ఘన్‌పూర్‌ 33 3,006 990 3,996

జనగామ 58 4,651 1,853 6,504

కొడకండ్ల 32 1,822 826 2,648

లింగాల ఘనపురం 32 2,245 890 3,135

నర్మెట 28 1,719 849 2,568

పాలకుర్తి 53 2,533 976 3,509

రఘునాథపల్లి 49 2,883 1,504 4,387

తరిగొప్పుల 22 995 403 1,398

జఫర్‌గఢ్‌ 32 2,485 1,018 3,503

మొత్తం 465 29,397 12,097 41,494

Advertisement
 
Advertisement
Advertisement