జనగామ రూరల్: కార్పొరేట్ స్థాయిలో విద్యనందిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న బీసీ గురుకులాలు పేద విద్యార్థులకు వరంగా మారాయి. నిత్యం విద్యార్థులకు నూతన విద్యావిధానాలకు అనుగుణంగా విద్యనందించడంతో పాటు పౌష్టికాహారం అందిస్తుంది. గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ విద్యాలయాల సంస్థ 2026–27 విద్యాసంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది. జిల్లావ్యాప్తంగా పదో తరగతి పూర్తైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు ఈనెల 12వ తేదీన దరఖాస్తుకు చివరి తేదీ ఉందని, విద్యార్థులు వినియోగించుకోవాలని బీసీ గురుకులాల సమన్వయ అధికారి శ్రీనివాస్ తెలిపారు.
దరఖాస్తు చేసుకునే విధానం
బీసీ గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు ఆయా గురుకులాల ప్రిన్సిపాళ్లకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. మిగతా విద్యార్థులు ఎంజేపీటీబీసీఅడ్మిషన్.ఓఆర్‌జీ అనే వెబ్‌సైట్‌లో ఈనెల 12వ తేదీలోపు రూ.200 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.
అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు
జిల్లాలో మొత్తం 6 బీసీ గురుకుల కళాశాలలు ఉన్నాయి. ఇందులో బాలుర కళాశాలలు 3, బాలికల కళాశాలలు 3 ఉన్నాయి. ప్రతీ కళాశాలలోఎంపీసీ 40, బైపీసీ 40, ఎంఈసీ 20, సీఈసీ 20 మొత్తం 720 సీట్లు ఉన్నాయి.
సద్వినియోగం చేసుకోవాలి
ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ విద్యార్థుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నాం. అన్ని రకాల వసతులతో ఉత్తమ బోధన కల్పిస్తున్నాం. జిల్లాలో 6 కళాశాలల్లో 720 సీట్లు ఉన్నాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– శ్రీనివాస్, ఎంజేపీ జిల్లా కోఆర్డినేటర్
ఈనెల 12 వరకు ఇంటర్ ప్రవేశాలకు
దరఖాస్తుల స్వీకరణ
జిల్లాలో 6 కళాశాలలు, 700పైగా సీట్లు
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
బీసీ గురుకులాల సమన్వయ అధికారి
శ్రీనివాస్


