ఎజెండా ఎలా ఆమోదిస్తారు? | - | Sakshi
Sakshi News home page

ఎజెండా ఎలా ఆమోదిస్తారు?

May 7 2026 8:02 AM | Updated on May 7 2026 8:02 AM

మేం రాకముందే

జనగామ: జనగామ మున్సిపల్‌ సాధారణ సమావేశం బుధవారం రసాభాసగా మారింది. గత నెల 30న వాయిదా పడిన సమావేశాన్ని బుధవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణి అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు ప్రారంభించారు. కౌన్సిల్‌లో మూడో వంతు సభ్యులు హాజరుకావడంతో చైర్‌పర్సన్‌ ఆదేశాల మేరకు 54 ఎజెండా అంశాలను సమావేశం ముందుంచగా కాంగ్రెస్‌కు చెందిన 9 మంది, బీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు సభ్యులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికి బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ ఉడుగుల కిష్ట య్య ఎజెండాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మెజారిటీ సభ్యులు ఆమోదం తెలవడంతో చైర్‌పర్సన్‌ అంశం ఆమోదించినట్లు ప్రకటించారు. ఇదే సమయంలో అరగంట ఆలస్యంగా వచ్చిన బీఆర్‌ఎస్‌ సభ్యులు, తాము రాకముందే ఎజెండా అంశాలు తీర్మానించడం ఏంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 54 ఎజెండా అంశాలను 30 నిమిషాల్లో ఎలా చదివారు? అని ప్రశ్నిస్తూ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో కాంగ్రెస్‌ సభ్యులు వారించగా మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఆగ్రహం.. నిరసనలు

బీఆర్‌ఎస్‌ సభ్యులు కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రాకముందే సమావేశం నిర్వహించడం అన్యాయమని ఆరోపించగా, కమిషనర్‌ మాత్రం నియమ నిబంధనల ప్రకారం చైర్‌పర్సన్‌ ఆదేశాలతోనే సమావేశం ప్రారంభించామని, మొత్తం వీడియో రికార్డ్‌ కూడా చేసినట్లు వారికి వివరించారు. అయితే బీఆర్‌ఎస్‌ సభ్యులు ఎజెండాలో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన అంశాలు ఉన్నాయని, కావాలనే తమ కు అవకాశం ఇవ్వకుండా ఆమోదించారని మండిపడ్డారు. చైర్‌పర్సన్‌ వారి ఆరోపణలను ఖండిస్తూ సమావేశానికి మూడు రోజుల ముందే నోటీసులు ఇచ్చామని, ఆలస్యంగా వచ్చిన వారు ఇప్పుడెలా అభ్యంతరం చెబుతారని, తమ హయాంలో ఏ దుర్వినియోగం జరగదని స్పష్టం చేశారు. ఉద్రిక్తతలు పెరిగే క్రమంలో చైర్‌పర్సన్‌ సమావేశం ముగిసినట్లు ప్రకటించి చాంబర్‌కు వెళ్లిపోయారు.

కమిషనర్‌ కారు ముందు బైఠాయింపు

ఆ తర్వాత కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి తన చాంబర్‌లోకి వెళ్లగా, అక్కడకు చేరుకున్న బీఆర్‌ఎస్‌ సభ్యులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. పరిస్థితి వేడెక్కడంతో కమిషనర్‌ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా, ఆయన కారు ముందు బైఠాయించి బీఆర్‌ఎస్‌ సభ్యులు అడ్డుకున్నారు. కొంతమంది బీఆర్‌ఎస్‌ సభ్యులు ఎజెండా కాపీలను చింపి నిరసన తెలిపారు. ఈ సంఘటనల నేపథ్యంలో సీఐతో పాటు పోలీసులు వచ్చి పరిస్థితిని సమీక్షించి ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం చేశారు. సమావేశంలో చర్చకు బదులు ప్రతీసారి గొడవలకు దిగుతున్న బీఆర్‌ఎస్‌ సభ్యుల ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని చైర్‌పర్సన్‌ బాలమణి వ్యాఖ్యానించారు. మరోవైపు చైర్‌పర్సన్‌ ఎజెండాను ఇష్టానుసారం ఆమోదించేందుకు ప్రయత్నిస్తున్నారని, దుర్విని యోగాన్ని అడ్డుకునేందుకే తాము ఆందోళన చేస్తున్నామని బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు అన్నారు. కమిషనర్‌ ఒక పార్టీకే మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు. రెండు గంటలపాటు కొనసాగిన ఉద్రిక్త వాతావరణం తర్వాత పరిస్థితి సాధారణమైంది.

30 నిమిషాల్లో 54 అంశాలు చదివారా?

ఎజెండా ఆమోదంపై బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌

కాపీల చించివేత..కమిషనర్‌ కారు ఎదుట బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల నిరసన

ఆలస్యంగా వచ్చి గొడవ చేస్తారా?:

చైర్‌పర్సన్‌ బాలమణి

రసాభాసగా ముగిసిన మున్సిపల్‌ సాధారణ సమావేశం

Advertisement
 
Advertisement
Advertisement