జనగామ: ప్రయాణికుల సౌకర్యమే ఆర్టీసీకి మొదటి ప్రాధాన్యమని, ప్రతీ సమస్యకు డిపో స్థాయిలో వెంటనే పరిష్కారం చూపుతామని కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.సొలొమోను తెలిపారు. బుధవారం జనగామ డిపోను ఆయన సందర్శించారు. డిపో పరిసరాలు, బస్సుల నిర్వహణ, సిబ్బంది పనితీరును పరి శీలించారు. అనంతరం బస్‌స్టేషన్‌న్‌లో జరిగిన ప్రయాణికుల సదస్సులో పాల్గొని వారితో నేరుగా మాట్లాడారు. కొన్ని రూట్లకు సంబంధించి ప్రయాణికులు సూచనలు, అభ్యర్థనలు తెలియజేయగా, ఈడీ సొలొమోను వెంటనే స్పందించి సంబంధిత డిపో మేనేజర్లకు తగిన ఆదేశాలు జారీ చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం జనగామ డిపో బస్సుల టైమింగ్స్‌తో కూడిన క్యాలెండర్లను ప్రజలకు అందించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ ఎస్.స్వాతి, సూపర్ వైజర్లు, సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు.
రైతులు ఆందోళన చెందొద్దు
జనగామ: జిల్లాలో తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో ఎలాంటి జాప్యం జరగడం లేదని సివిల్ సప్లయీస్ డీఎం హథీరామ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని హన్మంతాపూర్, ఆలీంపూర్, తమ్మడపల్లి రైతుల ధాన్యం ఎక్కువగా ఉన్న కారణంగా రవాణా పరంగా కొంత జాప్యం జరుగుతోందన్నారు. ఈ సమస్యను తక్షణం పరిష్కరించేందుకు అదనపు లారీలను ఏర్పాటు చేయడంతో పాటు తూకం వేసిన సరుకును ఆలస్యం చేయకుండా షిఫ్టింగ్ చేసేలా సదరు కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేశామన్నారు. జిల్లాలో గన్నీ బ్యాగుల కొరత లేదన్నారు. జిల్లాలో రైతులు ఆందోళన చెంది రోడ్డోక్కి రాస్తారోకోలు, ధర్నాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతీ గింజను కొనుగోలు చేసే బాధ్యతను జిల్లా యంత్రాంగం తీసుకుందని, రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
మక్కలు కొంటున్నాం..
జనగామ: జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతంగా కొనసాగుతున్నాయని మార్క్‌ఫెడ్ మేనేజర్ రాజశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 41,718 ఎకరాల్లో మొక్కజొన్న పండగా, అందులో 26,050 మెట్రిక్ టన్నుల దిగుబడి రానున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 11,05,527 క్వింటాళ్ల మొక్క జొన్నను కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 5 మక్కల కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 1,765 మంది రైతుల నుంచి 86,514 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు జరిగిందన్నారు. దీనికి సంబంధించి రూ.20.76 కోట్ల నగదును రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన శాశ్వత మానిటరింగ్ వేదిక ఆధ్వర్యంలో సీఏపీ నిల్వ కేంద్రం (4,000 మెట్రిక్ టన్నులు) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే యశ్వంతాపూర్ ఐకేపీ మక్కల కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్నల కొనుగోలు కొనసాగుతుందన్నారు.
కేంద్ర, రాష్ట్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
స్టేషన్‌ఘన్‌పూర్: రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను, సౌకర్యాలను రైతులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జి.అనిత సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 4 నుంచి నిర్వహిస్తున్న రైతువారం కార్యక్రమంలో భాగంగా స్థానిక రైతువేదికలో బుధవారం రైతులకు ప్రత్యేక అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలు, సహకార సంఘాలు, ఎఫ్‌పీఓల ద్వారా రైతులకు సేవలు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలు తదితర అంశాలపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఘన్‌పూర్ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి, డీసీఓ కోదండరాం, కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ దివ్య, వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ జన్ను భాస్కర్, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ చిర్ర నాగరాజు, నాబార్డు అధికారులు, బ్యాంకుల మేనేజర్లు, పీఏసీఎస్ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.


