● ఐకేపీ కేంద్రాల్లో తడిచిన ధాన్యం
● పలుచోట్ల రాలిన మామిడి
● తడిచిన ధాన్యం తరలింపుపై కలెక్టర్ ఆదేశాలు
జనగామ: జిల్లాలో అకాల వర్షం, ఈదురుగాలులు రైతుల కష్టానికి పరీక్షగా మారింది. మంగళవారం రాత్రి భారీగా వీచిన గాలులు, స్వల్ప వర్షంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ధాన్యం, మామిడితోటలకు స్వల్ప నష్టం జరుగగా, నష్టంపై జిల్లా పరిపాలన వేగంగా స్పందించారు. బచ్చన్నపేట మండలంలోని సాల్వాపూర్, గంగాపూర్, పడమటి కేశవాపూర్ ప్రాంతాల్లో మామిడి కాయలు రాలిపోగా, కోతకు సిద్ధమైన ధాన్యం గింజలు నీటిపాలు కాగా, సెంటర్లలో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న సరుకు కొంతమేర తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందారు. జనగామ మండలం గానుగుపహాడ్ సహా పలు ఐకేపీ సెంటర్లలో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న ధాన్యం తడిచింది. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని దేవరుప్పుల మండలంలో రైతులు హైవేపై రెండు గంటల పాటు ధర్నాకు దిగారు. జనగామ మార్కెట్ కాటన్ యార్డులోని ఐకేపీ, మెప్మా సెంటర్లలో ధాన్యం తడిసిపోగా, రైతులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా వెంటనే స్పందించారు. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసే దిశగా చర్యలు ప్రారంభించారు. నర్మెట మండలం బొమ్మకూరు కొనుగోలు కేంద్రాన్ని ప్రత్యక్షంగా సందర్శించి, ఆలస్యం జరగకుండా టోకెన్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. అనంతరం కలెక్టరేట్‌లో అత్యవసర సమావేశం నిర్వహించి అన్ని శాఖల సమ న్వయంతో కొనుగోలు తక్షణం పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


