బచ్చన్నపేట: ధాన్యం తరలించడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని, అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మంగళవారం మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. జాతీయ రహదారిపై ధర్నా చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే కిలోమీటరు మేర నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి నెల రోజులు గడుస్తున్నా తరలించడం లేదని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల వద్దకు లారీలు రావడం లేదన్నారు. ధర్నా వద్దకు వచ్చిన ఎస్సై శ్రీకాంత్ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడుతానని హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా మాజీ కోఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి, మాజీ సర్పంచ్ వడ్డెపల్లి మల్లారెడ్డి, పర్వతం మధుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


