భూసార పరీక్షలతో స్థిర వ్యవసాయం
జనగామ: జిల్లా రైతుల్లో భూసారం పరిరక్షణపై అవగాహన పెరుగుతోంది. మంచి దిగుబడులు సాధించాలంటే భూమి ఆరోగ్యం అత్యంత కీలకమని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. నేలలో పోషకాలు, సేంద్రియ పదార్థం, నీటి నిల్వ సామర్థ్యం, గాలి ప్రసరణ వంటి అంశాలు సమతుల్యంగా ఉన్న ప్పుడే పంటలు సమృద్ధిగా పండుతాయని అధికారులు చెబుతున్నారు. వచ్చే వానాకాలం సీజన్ నాటికి రైతులు మట్టి పరీక్షలు చేయించుకునే విధంగా వ్యవసాయ శాఖ అవగాహన కల్పిస్తోంది. పంటల సాగుకు 20 రోజుల ముందుగానే మట్టి పరీక్షలు చేయించుకుని సాగుపనులు మొదలుపెడితే ఎరువుల ఖర్చు తగ్గడంతో పాటు పంట దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.
భూసారాన్ని ప్రభావితం చేసే అంశాలు
జిల్లాలో ఇసుక, బంకమట్టి, ఎర్రమట్టి వంటి విభిన్న నేల రకాలున్నాయి. నేలలోని సేంద్రియ పదార్థం పరిమాణం, సూక్ష్మజీవుల క్రియాశీలత, వాతావరణ పరిస్థితులు ఇవన్నీ భూసారం స్థాయిని నిర్ణయించే ముఖ్యమైన అంశాలు. వరుస పంటలు, అధిక రసాయన ఎరువుల వినియోగం వల్ల భూసారం తగ్గుతు ండడంతో భూసార శ్రేణిని పెంచే పద్ధతులను రైతులు అవలంబించాలని నిపుణులు సూచిస్తున్నారు.
చెరువు మట్టి–మళ్లీ సారం చేరే మార్గం
రైతులు ప్రతీ 2–3 సంవత్సరాలకు ఎకరానికి 15 నుంచి 20 బండ్ల చెరువు మట్టిని వేయడం ద్వారా భూమిలో సూక్ష్మపోషకాలు పునరుద్ధరించవచ్చు. జనగామ, బచ్చన్నపేట, లింగాలఘణపురం ప్రాంతాల్లో ఇప్పటికే పలువురు రైతులు ఈ పద్ధతిని అమలు చేస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారని అధికారులు చెబుతున్నారు. చెరువు మట్టి నేల నిర్మాణాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
సేంద్రియ ఎరువులతో నేల ఆరోగ్యం
జిల్లాలో పెంటపోగు వినియోగం పెరుగుతోంది. పశువుల ఎరువు, పంట అవశేషాలతో తయారైన పెంటపోగు ఎరువు నేల గాలి ప్రసరణను, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుందని అధికారులు చెబుతున్నారు. రైతులు వర్మికంపోస్ట్ తయారీపై ఆసక్తి చూపుతున్నారు. 40 నుంచి 60 రోజుల్లో సిద్ధమయ్యే ఈ సహజ ఎరువు నేలలో సూక్ష్మజీవులను పెంచి పంటలకు తక్షణ పోషకాలను అందిస్తుంది.
పంటల మార్పిడి..
వరి తర్వాత పప్పు ధాన్యాలు, పత్తి తర్వాత కూరగాయలు వంటి పంటల మార్పిడి పద్ధతులు నేలలో పోషకాల లోపాలను నివారిస్తాయి. వరుసగా ఒకే పంట వేయడం వల్ల నేలలోని కొన్ని నిర్దిష్ట పోషకాలు తక్కువై దిగుబడులు పడిపోతున్నాయి.
విత్తనాల ఎంపిక, రైతుల అవగాహనే భవిష్యత్తు
వ్యాధి నిరోధక, స్థానిక వాతావరణానికి తట్టుకునే విత్తనాలను ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నేల పరీక్షలతో అవసరమైన ఎరువులను వినియోగించడం ద్వారా ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇదిలా ఉండగా జిల్లాలో గతంలో 6వేల మట్టి శాంపిళ్లు తీయగా, దీనికి సంబంధించిన రిపోర్టు కాపీల ను రైతులకు అందించారు. ప్రజా పాలనలో భాగంగా 176 రెవెన్యూ గ్రామాల్లో 1,760 మట్టి నమూనాలను సేకరించి, ఇందుకు సంబంధించి రిజల్ట్ కాపీలను రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అందించారు. రెండు రోజుల క్రితం ప్రారంభమైన రైతు సదస్సుల్లో గ్రామానికి 20 చొప్పున 3,520 మట్టి శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపించారు.
జిల్లాలో మట్టి పరీక్షల సమాచారం
రైతులు పట్టాలు: 1.86లక్షలు
రెవెన్యూ గ్రామాలు: 176
గతంలో మట్టి పరీక్షలు: 6009 (రిజల్ట్ వచ్చింది)
ప్రజాపాలనలో రెవెన్యూ గ్రామాల్లో చేసిన మట్టి పరీక్షలు: 1,760 (రిజల్ట్ వచ్చింది)
రైతు సదస్సుల్లో మట్టి పరీక్షల శాంపిళ్ల సేకరణ: 3,520
చెరువు మట్టితో భూమిలో సూక్ష్మ పోషకాలు
నేల పరీక్షల ప్రాధాన్యంపై రైతులకు అవగాహన
వానాకాలం సీజన్‌కు ఇప్పటి నుంచే కసరత్తు
స్థిర వ్యవసాయం వైపు అడుగులు
జిల్లా రైతులు సహజ ఎరువులు, పంటల మార్పిడి, నేల పరీక్షలు వంటి పద్ధతులను అవలంబిస్తే భూసార యాజమాన్యం మెరుగై, దీర్ఘకాలికంగా స్థిరమైన వ్యవసాయం సాధ్యమవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. భూసారం బలంగా ఉంటే పంటల దిగుబడులు పెరిగి రైతుల ఆదాయం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు.


