జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ ఎంపికలు

May 6 2026 8:07 AM | Updated on May 6 2026 8:07 AM

జనగామ రూరల్‌: పట్టణంలోని స్థానిక ధర్మకంచ మినీ స్టేడియంలో మంగళవారం జిల్లా స్థాయి 8, 10, 12, 14 16, 18 20 ఏళ్ల మెన్‌, ఉమెన్‌ అథ్లెటిక్స్‌ ఎంపికలు జరిగాయని జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్‌, ప్రధాన కార్యదర్శి గంగి శెట్టి మనోజ్‌ కుమార్‌ తెలిపారు. దాదాపు 130 మంది బాలబాలికలు వివిధ అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొన్నారని, ఎంపికై న 8, 10, 12 14 సంవత్సరాల బాలబాలికలు ఈనెల 17న కొల్లూరులో జరిగే రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొంటారన్నారు. అలాగే 14, 16, 18, 20 ఏళ్ల మెన్‌, ఉమెన్లలో ఎంపికై న క్రీడాకారులు ఈనెల 10వ తేదీన హన్మకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో జరిగే మూడో తెలంగాణ రాష్ట్ర స్థాయి త్రోస్‌ అండ్‌ జంప్స్‌ పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

జనగామ రూరల్‌: జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అసిస్టెంట్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌గా పనిచేయడానికి ఆసక్తి, అర్హతలు కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌, జిల్లా విద్యాశాఖ అధికారి సందీప్‌ కుమార్‌ ఝా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, లోకల్‌ బాడీ పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అభ్యర్థులు కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగి ఉండడం తప్పనిసరని ముఖ్యంగా ఎంఎస్‌ ఆఫీసు వంటి అప్లికేషన్లలో నైపుణ్యం కలిగి ఉండాలన్నారు. అదనంగా డేటా సైన్స్‌ అంశాలపై అవగాహనతో పాటు కంప్యూటర్‌ సైన్స్‌లో విద్యార్హతలు ఉండాలని స్పష్టం చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 7వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు కలెక్టర్‌ కార్యాలయం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న విద్యా శాఖ ఇన్‌వార్డ్‌ విభాగంలో సమర్పించాలని కోరారు.

డీఆర్‌ఓగా వెంకటేశ్వర్లు

జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల బదిలీలు, పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో సిరిసిల్ల ఆర్డీఓగా పనిచేస్తున్న సీహెచ్‌.వెంకటేశ్వర్లను జన గామ జిల్లా డీఆర్‌ఓగా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన సిరిసిల్లలో ఆర్డీఓగా విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో వెంటనే నూతన బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొన్నారు.

సీఐకి అభినందన పతకం

జనగామ: జనగామ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణరెడ్డి ఐటీ నిబంధనలు, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం(సీఓటీపీఏ) అమలు, డ్రగ్‌ నియంత్రణ చర్యల్లో చూపిన కఠినతరమైన అమలు విధానానికి గుర్తింపుగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ చేతుల మీదుగా మంగళవారం అభినందన పురస్కారం అందుకున్నారు. ఇటీవలి కాలంలో ఈగిల్‌ యాక్షన్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై చేపట్టిన ప్రత్యేక చర్యలు, యువతకు మాదక ద్రవ్యాల ప్రమాదాలపై అవగాహన కల్పించడంలో సీఐ సత్యనారాయణరెడ్డి కీలకపాత్ర పోషించారు. సమాజంలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, చట్టాల అమలు వంటి అంశాల్లో సీఐ సత్యనారాయణ రెడ్డి చేపట్టిన చర్యలు పోలీస్‌ విభాగంలో అభినందనీయమని కమిషనర్‌ పేర్కొన్నారు.

న్యాయవాదుల గుమస్తాల సంఘం నూతన కమిటీ

జనగామ రూరల్‌: జిల్లా కోర్టు న్యాయవాదుల గుమస్తాల సంఘం నూతన కార్యవర్గ కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కోర్నపాక ఉపేందర్‌, ప్రధాన కార్యదర్శిగా వల్లూరి నరేష్‌ ఎంపిక కాగా ఉపాధ్యక్షుడిగా భైరగోని శ్రీను, కోశాధికారిగా యాట అశోక్‌, కార్యదర్శిగా వేల్పుల మల్లేష్‌, కల్చరల్‌ యాక్టివిటీ ఇన్‌చార్జ్‌గా లకావత్‌ మహేందర్‌, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్స్‌గా శాడా శ్రవణ్‌, తోకల రమేశ్‌, గూడెపు అశోక్‌ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు ఎమ్డీ ఖాజా పాషా, పుస్కూరి రఘు, ఎదునూరి పోచయ్య, బైరి శ్రీను, తుంగ బాలస్వామి, మల్ల మధు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement