వెల్లువలా వినతులు | - | Sakshi
Sakshi News home page

వెల్లువలా వినతులు

May 5 2026 6:50 AM | Updated on May 5 2026 6:50 AM

కలెక్టరేట్‌ ప్రజావాణికి తరలొచ్చిన అర్జీదారులు

151 దరఖాస్తులు స్వీకరించిన

అధికారులు

వేగంగా పరిష్కరించాలని కలెక్టర్‌

సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశం

జనగామ రూరల్‌: కలెక్టరేట్‌ ప్రజావాణికి అర్జీదారులు పోటెత్తారు. చెల్లి కూతుళ్లు ఇంటి నుంచి వెళ్లగొట్టారని ఓ మహిళ, బోదకాలుతో ఇబ్బంది పడుతున్నానని.. పెన్షన్‌ ఇచ్చి ఆదుకోవాలని ఒకరు,, భర్తలేడని తనకు పెన్షన్‌ ఇవ్వాలని ఓ వివాహిత..ఇలా పలు సమస్యలతో సోమవారం గ్రీవెన్స్‌ సెల్‌కు వచ్చారు. కలెక్టర్‌ కార్యాలయంలోని మెయిన్‌ కాన్ఫరెన్‌న్స్‌ హాల్లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో అదనపు కలెక్టర్‌ బెన్‌ షాలోమ్‌ కలిసి కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా 151 అర్జీలను స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు వేగంగా పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. అన్ని శాఖల జిల్లా అధికారులు, వారి పరిధిలో ఉండే సిబ్బంది స్వీయగణన నమోదు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రంగారావు, మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృ నాయక్‌, డీఎంహెచ్‌ఓ మల్లికార్జునరావు, డీడబ్ల్యూఓ కోదండరాములు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

దరఖాస్తుల్లో కొన్ని..

● జనగామ మండలం చీటకోడూరు గ్రామానికి చెందిన కె.గణేష్‌ యాదవ్‌, తాను బీసీ డీ, యాదవ కులానికి చెందినవాడినని, తల్లిదండ్రులు కూలి పని చేస్తుంటారని, భూమి జాగా లేదు అని, ప్రైవేట్‌లో చదివించే స్థోమత లేదని, ఎంజేపీలో సీటు ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నాడు.

● లింగాల ఘణపురం మండలం పటేల్‌ గూడెం గ్రామానికి చెందిన జె.సురేష్‌, తనకు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం విద్యుత్‌ తీగల వల్ల ఆగిందని బిల్లు రాక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సమస్యను పరిష్కరించాలని వినతి అందజేశాడు.

● పాలకుర్తి మండలం సరిసన్నగూడెం గ్రామానికి చెందిన ఎస్‌.కొమురమ్మ తమది నిరుపేద కుటుంబమని, ఉండడానికి ఇల్లు లేదని, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని కోరింది.

● జనగామ మండలం వెంకిర్యాల గ్రామానికి చెందిన మామిడి అంజయ్య, తనకు పెంకుటిల్లు ఉందని, అది శిథిలావస్థలో ఉందని, ప్రస్తుతం అద్దెకు ఉంటున్నారని, డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని వినతిపత్రం అందజేశాడు.

● లింగాల ఘణపురం మండలం చీటూరు గ్రామ సర్పంచ్‌ బర్ల గణేష్‌, గ్రామంలోని ఎంపీపీ పాఠశాలకు అదనపు తరగతి గదులు కావాలని, అలాగే వంటశాల షెడ్‌ మంజూరు చేయలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

● జనగామ పట్టణం వెంకన్నకుంటకు చెందిన బి.లక్ష్మి తన భర్త 5ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడని, సొంత ఇల్లు కూడా లేదని వాపోయింది. కూలి పని చేసుకుంటూ అద్దె ఇంట్లో తన పిల్లలతో జీవిస్తున్నానని, వితంతు పెన్షన్‌ మంజూరు చేయాలని కోరింది.

కలెక్టరేట్‌లో వైద్య శిబిరం

ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కలెక్టరేట్‌కు వచ్చే వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు పడకుండా ఏఎన్‌ఎంతో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌కు వచ్చేవారు బీపీ, షుగర్‌ వంటి పరీక్షలు చేయించుకోని మందులు తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement