జనగామ రూరల్: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించడంతోపాటు కుటుంబ ఆర్థిక ప్రగతికి వెన్నుదన్నుగా నిలుస్తున్న మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు బీమా పథకం మరింత ధీమా ఇవ్వనుంది. మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా వారి జీవితాలకు భరోసా కల్పిస్తూ..ప్రమాద బీమా పథకాన్ని 2028 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్నవారిలో ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా పరిహారం పొందే సౌలభ్యం కల్పించింది. దీనిపై జిల్లాలో సీ్త్రనిధి రుణాలు పొందిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు మరింత లబ్ధి చేకూరనుంది.
జిల్లాలో 12 మండల సమైక్య సంఘాల్లో 11,237 సంఘాలున్నాయి. ఇందులో 1,26,786 మంది సభ్యులు ఉన్నారు. వీరు సీ్త్రనిధితో పాటు, బ్యాంకుల ద్వారా రుణాలు పొందుతూ స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించుకుంటున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆయా యూనిట్లు, ఉపాధి అవకాశాలు నెలకొల్పి, ఉపాధి పొందుతున్నారు. ప్రమాద బీమాను పెంచుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బీమా పథకం సీ్త్రనిధి ద్వారా అమలు జరగనుంది.
మహిళలు స్వశక్తి సంఘంలో ఉండి ఏదైనా సహజమరణం చెందితే వారు తీసుకున్న రుణం మాఫీ కానుంది. ఆదే సీ్త్రనిధి, బ్యాంక్ రుణాలు తీసుకున్న మహిళా సంఘం సభ్యురాలు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం అందించే రూ.10లక్షలు నామినీ ఖాతాల్లో జమ చేయనున్నారు. వారికి సంబంధించిన రుణాన్ని మాఫీ చేస్తారు. 50 శాతం మించిన అంగవైకల్యం ఏర్పడితే సదరం ధ్రువపత్రం ద్వారా పరిశీలించి, రూ.5 లక్షలు అందించనున్నారు. ఈ పథకం ప్రారంభించక ముందు రుణం పొందిన వారు మరణిస్తే, వడ్డీతో కలిపి చెల్లించాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులు, సంఘం సభ్యులపై పడేది. పథకం లబ్ధికి అర్హత గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో 18 నుంచి 58 ఏళ్ల వారు స్వయం సహాయ సభ్యురాలిగా ఉన్నవారికి బీమా వర్తిస్తుంది.
స్వశక్తి సంఘాల మహిళలకు
బీమా భరోసా
ప్రమాదవశాత్తు మరణిస్తే
రూ.10 లక్షలు, రుణమాఫీ
పథకాన్ని 2028 వరకు
పొడిగించిన ప్రభుత్వం
జిల్లాలో 1,26,786 మంది సభ్యులు


