స్టేషన్‌ఘన్‌పూర్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, కలెక్టర్ సూచనల మేరకు ఆర్‌డీఓ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఘన్‌పూర్ ఆర్‌డీఓ ఆఫీస్‌లో నిర్వహించిన ప్రజావాణికి 30 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆర్‌డీఓ డీఎస్ వెంకన్న మాట్లాడారు.. డివిజన్‌లోని వివిధ మండలాల నుంచి పలు సమస్యలపై 30 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇకపై ఆర్‌డీఓ కార్యాలయంలో ప్రతీ సోమవారం ప్రజావాణి ఉంటుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలు అందించిన దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు.
8న వరంగల్‌లో జాబ్ మేళా
జనగామ: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా యువతకు ఉపాధి అవకాశాలను విస్తృతంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇంటర్మీడియట్ నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్హత ఉన్న నిరుద్యోగ యువత కోసం మార్కెటింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్, హెల్త్‌కేర్, ఐటీ, బిజినెస్ సర్వీసెస్, కస్టమర్ సర్వీస్, హాస్పిటల్, డిజిటల్ మీడియా, లాజిస్టిక్స్ వంటి విభిన్న రంగాల్లో ఉపాధి కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. జిల్లా యువజన క్రీడల శాఖ, ఇండస్ట్రీస్, కామర్స్ విభాగం, ఐటీఈ,–సీ శాఖ ఆధ్వర్యంలో 50 కి పైగా ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో భాగస్వామ్యం కానున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి కె.కోదండరాములు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా యువత కోసం ఈ నెల 8వ తేదీన వరంగల్‌లో ఈ జాబ్‌మేళా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జాబ్ మేళాలో పాల్గొనే యువత https://satg.telangana. gov.in/prajapalana వెబ్‌సైట్ ద్వారా లేదా కేటాయించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాల కోసం–918255 2593 నెంబర్‌ను సంప్రదించవచ్చని తెలియజేశారు.
ఆయిల్‌పామ్ సాగుపై
నేడు అవగాహన సదస్సు
బచ్చన్నపేట: ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన కలిగించేందుకు నేడు (మంగళవారం) మండల కేంద్రంలో ఆయిల్‌పామ్ రైతుల అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఆయిల్‌ఫెడ్ ఇన్‌చార్జ్ దయాకర్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. నేడు ఉదయం 11 గంటలకు మండల కేంద్రంలోని జనగామ రోడ్డులో గల శ్రీనివాస ఫంక్షన్ హాల్‌లో జరిగే అవగాహన సదస్సుకు అన్ని గ్రామాల రైతులు అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు. సదస్సుకు తెలంగాణ రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, డీసీసీ అధ్యక్షులు లకావత్ ధన్వంతి, డీసీసీ ఉపాధ్యక్షుడు నూకల బాల్‌రెడ్డి, పలువురు అధికారులు హాజరవుతున్నారని తెలిపారు.
టైర్ పేలి మద్యం వ్యాన్ బోల్తా
రఘునాథపల్లి: హైదరాబాద్–హన్మకొండ జాతీయ రహదారిలోని గోవర్ధనగిరి వద్ద సోమవారం రాత్రి ఓ మద్యం వ్యాన్ టైర్ పేలి బోల్తాపడింది. రాంపూర్ నుంచి రూ.5 లక్షల విలువైన మద్యం లోడ్‌తో జనగామ వైపు వెళ్తుండగా గోవర్ధనగిరి సమీపంలోకి రాగానే టైర్ పేలడంతో వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ఉన్న ఇద్దరు కార్మికులు, డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో మద్యం సీసాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. సగం వరకు మద్యం సీసాలు పగిలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మద్యం సీసాలు అపహరణకు గురికాకుండా చర్యలు తీసుకున్నారు.


