వచ్చుడే లేటు..గంటకే పోవుడు | - | Sakshi
Sakshi News home page

వచ్చుడే లేటు..గంటకే పోవుడు

May 5 2026 6:50 AM | Updated on May 5 2026 6:50 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌: వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పింఛన్ల కోసం లబ్ధిదారులు గంటల తరబడి మండుటెండలో వేచి ఉండాల్సి వస్తోంది. పట్టణానికి చెందిన లబ్ధిదారులకు స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో ప్రతీ నెల తపాలాశాఖ సిబ్బంది పింఛన్లు పంపిణీ చేస్తారు. అయితే పంపిణీ చేసే సిబ్బంది సకాలంలో రాకపోవడం, వచ్చినా ఒక గంట సేపు పంపిణీ చేసి వెళ్లిపోతుండగా లబ్ధిదారులు పెన్షన్‌ కోసం పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం వేసవికాలంలో ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో నరకయాతన అనుభవిస్తున్నారు. సోమవారం ఉదయం 8 గంటల వరకే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు పెన్షన్‌ కోసం మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే 11 గంటల వరకు పెన్షన్‌ పంపిణీ చేసే వారు రాకపోవడంతో మండుటెండలో పండుటాకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం 11 గంటల వచ్చిన సిబ్బంది కేవలం ఒక గంట సేపు పంపిణీ చేసి వెళ్లిపోవడంతో లబ్ధిదారులు చేసేదేమి లేక మధ్యాహ్నం వరకు వేచి ఉన్నారు. ఈ విషయమై మున్సిపల్‌ చైర్మన్‌, సంబంధిత అధికారులు స్పందించాలని, పెన్షన్‌లను సకాలంలో పంపిణీ చేయాలని, ఒకే చోట అందరికీ కాకుండా వార్డుల వారీగా ఆయా బస్తీలలో పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

సకాలంలో పింఛన్లు అందించని తపాలా సిబ్బంది

మండుటెండల్లో

పండుటాకుల నిరీక్షణ

Advertisement
 
Advertisement
Advertisement