జనగామ: జిల్లాలో సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి, ఈదురుగాలులతో అన్నదాతను టెన్షన్ పెట్టించింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటతో పాటు ధాన్యం కొనుగోలు సెంటర్లలో నిల్వలు, రహదారులపై ఆరబోసిన ధాన్యంతో రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కోతకు సిద్ధమైన పంటలకు కూడా అకాల వర్షాలు ముప్పుగా మారాయి. జిల్లాలో ఆదివారం ఉదయం 42 డిగ్రీల సెల్సీఎస్ ఆకాశంలో మబ్బులు, ఉరుములు కనిపించినప్పటికీ మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండలు రైతులను ఇబ్బందులకు గురిచేశాయి. సాయంత్రం ఐదున్నర తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో పాటు ఈదురుగాలులు, కొన్నిచోట్ల చిరుజల్లు కురవడంతో జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఆకస్మిక మార్పులు చోటు చేసుకున్నాయి. అకాల వాతావరణ మార్పులు రైతుల్లో ఆందోళన పెంచాయి.
ధాన్యం నిల్వలపై వర్షం ప్రభావం
ధాన్యం కొనుగోలు సెంటర్లలో కాంటా పూర్తి చేసుకుని తరలింపునకు సిద్ధంగా ఉంచిన వేలాది బస్తాలతో పాటు కొనుగోలుకు ఎదురుచూస్తున్న ధాన్యం నిల్వలతో అధికార యంత్రాంగంతో పాటు రైతులు అలర్టయ్యారు. తేమ శాతం కోసం రహదారులు, కల్లాలు, గ్రామ పరిసరాల్లో ఆరబోసుకున్న ధాన్యాన్ని రైతులు వెంటనే ఒకచోట చేర్చి కుప్పగా చేస్తున్నారు. టార్పాలిన్ కవర్లు ముందస్తుగా సిద్ధం చేసుకుని వర్షం కురిస్తే నష్టం జరగకుండా అష్టకష్టాలు పడుతున్నారు.
కోతకు సిద్ధంగా వరి
జిల్లాలో అన్ని మండలాల్లో కొంతమేర వరి పంటలు కోతకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సమయంలో ఈదురుగాలులు, అకాల చిరుజల్లులు పంటలకు నష్టం చేసే అవకాశం ఉండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా మార్చి చివరి వారం, ఏప్రిల్ మొదటి వారాల్లో వడగళ్ల వాన, ఈదురుగాలులతో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చేది. అయితే ఈసారి మే తొలివారంలో ఇలాంటి వాతావరణ మార్పులు రైతులను మరింతగా టెన్షన్ పుట్టించేలా గురిచేస్తున్నాయి.
చల్లబడుతున్న ఆకాశంతో రైతుల కష్టాలు
ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు దంచికొట్టే ఎండలు నమోదయ్యాయి. వెంటనే గాలులు, చిరుజల్లులు రావడంతో వాతావరణం పూర్తి భిన్నంగా మారిపోయింది. వడదెబ్బకు గురి చేసే విధంగా మండే ఉష్ణోగ్రతల మధ్య ధాన్యం రక్షణ చర్యలు చేపట్టడం రైతులకు భారీ శ్రమగా మారింది. ఈ పరిస్థితుల్లో ధాన్యం, పంటలకు ఏ నష్టం జరగకూడదని రైతులు వరుణ దేవున్ని ప్రార్థిస్తున్నారు.


