జనగామ రూరల్: పారా లీగల్ వలంటరీలకు చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో పారా లీగల్ వలంటరీలకు చట్టాలపై భవిష్యత్తులో చేసే కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎస్.శ్రీదేవి, వలంటీర్లు పాల్గొన్నారు.
నూతన జడ్జి బాధ్యతల స్వీకరణ
స్టేషన్‌ఘన్‌పూర్: స్టేషన్‌ఘన్‌పూర్ జూనియర్ సివిల్ కోర్టుకు పర్మినెంట్ జడ్జిగా వచ్చిన జూనియర్ సివిల్ జడ్జి శివలీల శనివారం బాధ్యతలు స్వీకరించగా ఘన్‌పూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కనకం రమేశ్, న్యాయవాదులు స్వాగతం పలికారు. ఆయన వెంట బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మునిగాల రవీందర్, షన్మాకుమారి, శ్రీనివాస్, బాబు తదితరులున్నారు. ఈసందర్భంగా స్థానిక న్యాయవాదులు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో న్యాయవాదులు గట్టు రవి, గట్టు మనోహర్, నీరటి కార్తీక్, పోగుల కార్తీక్, గాదె పృథ్వీ, సుష్మ, భువన్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.
ప్రతీ సోమవారం ఆర్డీఓ కార్యాలయాల్లో గ్రీవెన్స్
జనగామ: జిల్లాలో ప్రజల వినతులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతీ సోమవారం ఆర్డీఓ కార్యాలయాల్లో రెవెన్యూ డివిజన్ స్థాయి గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టరేట్ సూపరింటెండెంట్ రజిత శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రీవెన్స్‌లో ఆర్‌డీఓ నోడల్ అధికారిగా పర్యవేక్షించనుండగా, అన్ని శాఖల డివిజన్ స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై, ప్రజల వినతులను స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతీ అర్జీని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఇక నుంచి ఎన్‌ఐీసీ పోర్టల్ స్థానంలో సీజీజీ గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా నమోదు చేయడం జరుగుతుందన్నారు. ప్రతీ వినతిదారుడికి యూనిక్ రిఫరెన్స్ నెంబర్‌తో కూడిన రశీదు పత్రం ఇవ్వనున్నట్లు, దీని ద్వారా వారు తమ వినతిని ఆన్‌లైన్‌లో సులభంగా తెలుసుకోవచ్చన్నారు. వినతులను 30 రోజుల్లోపు పరిష్కరించి, సంబంధిత నివేదికలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. ఆలస్యం జరిగితే ఆ కేసులను నేరుగా ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుందని ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
దరఖాస్తుల పరిశీలన
జనగామ: జనగామ పురపాలిక కార్యాలయంలో ఎస్సీ నిరుద్యోగ యువతీ, యువకులు ఎలక్ట్రిక్ వెహికిల్ టూ వీలర్, టూవీలర్(గూడ్స్, ప్యాసింజర్) కోసం చేసుకున్న ఆన్‌లైన్ ద్వారా చేసుకున్న దరఖాస్తులను పరిశీలించారు. శనివారం మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, కార్పొరేషన్, రవాణాశాఖ, బ్యాంకు అధికారుల సమక్షంలో దరఖాస్తులను స్క్రీనింగ్ టెస్ట్ చేశారు. వీటి కోసం 95 మంది దరఖాస్తు చేసుకోగా, స్క్రీనింగ్ టెస్ట్ కోసం 82 మంది హాజరయ్యారు.
జిల్లా కాంగ్రెస్ కమిటీ నియామకం
● 69 మందితో నూతన కమిటీ
● డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి
జనగామ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్ ఆమోదంతో జిల్లా కాంగ్రెస్ కమిటీకి కొత్తగా 69 మంది వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, ట్రెజరర్, సెక్రటరీలు, స్పోక్స్ పర్సన్లు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ల నియామకాలను ప్రకటించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతిలక్ష్మినారాయణ నాయక్ ఆధ్వర్యంలో తుది పరిశీలన జరిగిన తర్వాత శనివారం ఈ జాబితా విడుదల చేశారు. అనంతరం డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ జిల్లా కమిటీ పేర్లను వెల్లడించారు. జిల్లాలో పార్టీ కార్యకలాపాలు, బూత్ స్థాయి బలోపేతం, సభ్యత్వ విస్తరణ, వచ్చే ఎన్నికల వ్యూహాల రూపకల్పనలో ఈ కొత్త కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని ధన్వంతి తెలిపారు.


