ఈతకు వెళ్లి యువకుడి గల్లంతు | - | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి యువకుడి గల్లంతు

May 3 2026 7:35 AM | Updated on May 3 2026 7:35 AM

బచ్చన్నపేట: సరదాగా ఈత కొట్టడానికి స్నేహితులతో కలిసిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు బావి లో పడి గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులు, ఎస్సై శ్రీకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఎనుగుల పద్మ– భిక్షపతి దంపతులకు చిన్నకుమారుడు ఎనుగుల ప్రశాంత్‌ (27) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం గ్రామశివారులోని చేర్యాల రహదారి పక్కనగల రాజన్న బావిలో ఈత కొట్టడానికి వెళ్లాడు. ఇందులోభాగంగా బావి పక్కనే ఉన్న చెట్టు ఎక్కి బావిలో దూకిన ప్రశాంత్‌ నీటి అడుగుభాగానికి వెళ్లి పైకి రాలేదు. గమనించిన స్నేహితులు బావిలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహం కోసం వెతికినా రాత్రి వరకు కూడా మృతదేహం లభ్యం కాలేదు. దీంతో నేడు(ఆదివారం) మళ్లీ బావిలో మృతదేహం కోసం వెతకనున్నట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement