జనగామ: జనగామ మున్సిపల్ పరిధిలోని ఎలక్ట్రిక్ వెహికిల్, టూ వీలర్, ఎలక్ట్రిక్ టూవీలర్(గూడ్స్ అండ్ ప్యాసింజర్) కోసం దరఖాస్తు చేసుకున్న ఎస్సీ నిరుద్యోగ యువతీ, యువకులకు శనివారం(2వ తేదీ) మున్సిపల్ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు.
జఫర్‌గఢ్: మండల కేంద్రంలోని వేల్పుగొండ కొండ దిగువన ఉన్న సీతారామచంద్ర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈ నెల 3న (ఆదివారం) శ్రీరంగనాథస్వామి మూర్తి విగ్రహా ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకుడు పొడిచేటి వెంకటాచార్యులు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా శనివారం నుంచి రెండు రోజుల పాటు ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. మరింగంటి నర్సింహాచార్యుల కుటుంబ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వేడుకల్లో భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
జనగామ: జిల్లాలో రైతులకు మద్దతు ధర కల్పించేందుకు అన్నదాతల ముంగిటే సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఇన్‌చార్జ్ డీఆర్డీఓ నూరొద్దీన్ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ‘మా పడ్లు కొనండి సారూ’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. రైతు ఇంటి దగ్గరే మార్కెట్ సౌకర్యాలు కల్పిస్తూ, ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతుతో ఎంఎస్‌పీని పూర్తి స్థాయిలో అందిస్తున్నామని అధికారులు హామీ ఇచ్చారు. 12 మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు సజావుగా జరుగుతోందని కొన్ని గ్రామాలను ఇతర కేంద్రాలకు లింక్ చేసినట్లు తెలిపారు. అందులో భాగంగా జనగామ మండలం యశ్వంతాపూర్ గ్రామాన్ని చీటకో డూరు కొనుగోలు కేంద్రానికి అనుసంధానం చేసినట్లు వివరించారు. గ్రామాల రైతులు తమ గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం అమ్ముకోవాలన్నారు.
వైభవంగా హేమాచలుడి తిరుకల్యాణం
మంగపేట: రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి గాంచిన మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో లక్ష్మీనర్సింహాస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. ఆలయ కార్యనిర్వాహణ ఇన్‌చార్జ్ అధికారి ఎం.వీరస్వామి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో లక్ష్మీనర్సింహాస్వామి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల కల్యాణ మహోత్సవాన్ని భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకుడు అమరవాది మురళీ కృష్ణమాచార్యుల బృందం వేద మంత్రోచ్ఛరణ నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు ప్రధానాలయంలోని స్వయంభు స్వామివారిని నూతన వస్త్రాలంకరణ చేసి నిత్యారాధన, తిరు కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. సుమారు రెండు గంటల పాటు స్వామివారి కల్యాణ మహోత్సవ క్రతువును నిర్వహించారు. 12.30 గంటలకు అభిజిత్ లగ్నంలో జిలకరబెల్లం, మాంగళ సూత్రదారణ, ముత్యాల తలంబ్రాలతో స్వామివారి కల్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిపించారు.


