జనగామ: జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగంలో అవగాహన పెంపుతో పాటు స్వయం సహాయక సంఘాల సాధికారతకు దోహదపడేలా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేపట్టినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం హాల్‌లో దీనిపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం (టీఓటీ) నిర్వహించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధ్యక్షతన డీఆర్డీఏ, సెర్ప్, పరిశ్రమల శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏపీఎంలు, ఎంఎస్‌ఓలు, సీసీలకు దశలవారీ మార్గదర్శకత్వం అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని స్వయం సహాయక సంఘాలు మే 10లోపు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అనేక సబ్సిడీలు, ఆర్థిక ప్రోత్సాహకాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
స్నేహ వేసవి కాలపట్టికపై అవగాహన
ఉద్యమ్ శిక్షణ అనంతరం స్నేహ వేసవి కాలపట్టిక 2026పై జిల్లా స్థాయి సమన్వయ సమావేశాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నిర్వహించారు. మే 2 నుంచి జూన్ 10 వరకు జరిగే ఈ శిబిరాల్లో బాలబాలికల అభివృద్ధి, భద్రత, అవగాహన, ఆరోగ్యం, నైపుణ్యాలు, కెరీర్ మార్గదర్శకత్వం వంటి అంశాలపై ప్రత్యేక సెషన్లు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ నూరుద్దీన్, డీపీఓ వెంకట్‌రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలి
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11 నుంచి 16 వరకు నిర్వహించే విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. విద్యా వారోత్సవాలపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో విద్యా శాఖ ఏడీ శ్రీని వాస్, ఇతర విద్యా శాఖ అధికారులు, అన్ని మండలాల ఎంఈఓలు, హెడ్ మాస్టర్లు పాల్గొన్నారు.
కొనుగోలు ప్రక్రియ సజావుగా ఉండాలి
జనగామ రూరల్: జిల్లాలో ఏర్పాటు చేసిన 234 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగాలని, ఇందుకు వ్యవసాయ, సివిల్ సప్ప్లై వివిధ శాఖల అధికారులు సమన్వయంగా పనిచేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. మండలంలోని శామీర్‌పేట్‌లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు.
సమీక్షలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


