ప్రొటోకాల్‌ రగడ | - | Sakshi
Sakshi News home page

ప్రొటోకాల్‌ రగడ

May 1 2026 5:51 AM | Updated on May 1 2026 5:51 AM

అజెండా చదివే సమయంలో అజెండా ఎవరిని అడిగి తయారు చేశారు? మూడు గంటల ఉద్రిక్తత..

వేదికపై వద్దనడం అవమానం..

వైస్‌ చైర్మన్‌కు గౌరవం ఇవ్వడం లేదని బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల వాగ్వాదం

జనగామ: మున్సిపల్‌ సాధారణ సమావేశంలో ప్రొటోకాల్‌ వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. వైస్‌ చైర్మన్‌కు వేదికపై అవకాశం ఇవ్వలేదంటూ బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కి, చివరికి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధంగా మారింది. గురువారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణిశ్రీనివాస్‌ అధ్యక్షతన 54 అంశాలతో కూడిన అజెండాతో పురపాలిక సాధారణ సమావేశం జరిగింది. కౌన్సిల్‌ సాధారణ సమావేశం ప్రారంభం కానున్న వేళ, గత సంప్రదాయం ప్రకారం మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ భూష పర్వతాలు వేదికపై కూర్చునే అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు కోరారు. వైస్‌ చైర్మన్‌కు వేదికపైనే గౌరవం ఇవ్వాలని ఉడుగుల కిష్టయ్య, గోపగోని సుగుణాకర్‌ గౌడ్‌, సజ్జ దుర్గాప్రసాద్‌, సేవెల్లి మధు, పానుగంటి సువార్త, అనూష, హఫీజ్‌ ఫాతిమా, మామిడాల రజిత, దావెర రామ రాజు, గునిగంటి వెన్నెల తదితర గులాబీ కౌన్సిలర్లు ప్రశ్నించారు.

ప్రొటోకాల్‌ గొడవ జరుగుతున్న సమయంలో పురపాలిక అధికారి కౌన్సిల్‌ అజెండా అంశాలు చదవడం ప్రారంభించగానే బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ కుర్చీని వేదికపై తీసుకెళ్లారు. దీనిపై కాంగ్రెస్‌ కౌన్సిలర్లు చెంచారపు కరుణాకర్‌రెడ్డి, రజిని, బుక్కా బాలభరద్వాజ్‌, పాముకుంట్ల ప్రసాద్‌ గౌడ్‌ తదితరులు వేదికపైకి చేరి ఆ కుర్చీ తీసివేయడానికి ప్రయత్నించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తమైంది. సమావేశ ప్రాంగణానికి వెంటనే పోలీసులు చేరుకున్నారు. సమాచారం అందుకున్న సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సైలు భరత్‌, చెన్నకేశవులు, మహిళా కానిస్టేబుళ్లతో కలిసి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేపట్టారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ఒకేసారి జరిగినా, వేదికపై కూర్చోడానికి ఎటువంటి జీఓ లేదని చైర్‌పర్సన్‌ బాలమణి పేర్కొన్నారు. చైర్‌పర్సన్‌ లేని సందర్భంలో మాత్రమే వైస్‌ చైర్మన్‌ సభ చేపడతారని కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే వైస్‌ చైర్మన్‌ వేదికపై కూర్చోవచ్చని తమ వద్ద ఆధారాలు ఉన్నాయని బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఓ జీఓ కాపీని చూపించారు. అజెండా ప్రారంభ సమయంలో 15వ వార్డు కౌన్సిలర్‌ మా రబోయిన పాండు గత సమావేశానికి సంబంధించిన తమ ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలని అధికారులను అడిగారు.

అజెండా ఎవరిని అడిగి తయారు చేశారు? వైస్‌ చైర్మన్‌కు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? అని బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ప్రశ్నించారు. అజెండా కాపీలు సాధారణ సమావేశానికి ఎన్ని రోజులు ముందుగా ఇవ్వాలి అనే ప్రశ్నలను లేవనెత్తారు. ప్రతీ కౌన్సిలర్‌ వార్డుల పర్యటన చేసి ప్రజాసమస్యలను పరిగణనలోకి తీసుకుని అజెండా సిద్ధం చేయాలని, ఇష్టానుసారంగా అజెండా తయారు చేయడం ఏంటని మండిపడ్డారు.

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగిన మున్సిపల్‌ సాధారణ సమావేశంలో ఉద్రిక్తత కారణంగా సభ ముందుకు సాగలేదు. వేదిక గౌరవం, అజెండా ప్రొటోకాల్‌, వైస్‌ చైర్మన్‌ అవమానానికి సంబంధించి న వివాదం తీవ్రరూపం దాల్చడంతో, పరిస్థితి అదుపులో లేకపోవడంతో చైర్‌పర్సన్‌ బాలమణి శ్రీనివాస్‌ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశంలో కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, మేనేజర్‌ రాములు, ఎన్పీడీసీఎల్‌ ఏఈ సౌమ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

నిబంధనలు లేవన్న చైర్‌పర్సన్‌,

కమిషనర్‌

వేదికపై కుర్చీ వేసిన బీఆర్‌ఎస్‌ సభ్యులు

కుర్చీ తొలగించేందుకు

కాంగ్రెస్‌ ప్రయత్నం

పోడియం వద్ద గులాబీ కౌన్సిలర్ల

బైఠాయింపు

పరిస్థితి అదుపు తప్పడంతో వాయిదా

వేదికపై కూర్చున్న వైస్‌ చైర్మన్‌ పర్వతాలను పోలీసులు నచ్చజెబుతూ కిందికి దింపేందుకు ప్రయత్నించగా మరోసారి ఉద్రిక్తత నెలకొంది. గులాబీ కౌన్సిలర్లు పోడియం వద్ద బైఠాయిస్తూ వైస్‌ చైర్మన్‌కు గౌరవం ఇచ్చేవరకు తమ సీట్లలో కూర్చోమని నిరాకరించారు. బీసీ వైస్‌ చైర్మన్‌ పర్వతాలను అవమానపరుస్తున్నారని, అంబేడ్కర్‌ రాజ్యాంగం ఇక్కడ అమలు కావడంలేదని బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చకు తాము ఎప్పుడూ ఆటంకం కలిగించమని, కానీ వైస్‌ చైర్మన్‌కు వేదిక గౌరవం దక్కేవరకు పోడియం వద్దే కూర్చుని సభను కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. చేర్యాల, స్టేషన్‌ ఘన్‌పూర్‌ మున్సిపాలిటీల్లో వైస్‌ చైర్మన్లను వేదికపై కూర్చోడానికి జీఓ ఉంటే జనగామలో ఎందుకు వర్తించదంటూ ప్రశ్నలు లేవనెత్తారు. అలాగే కలెక్టరేట్‌ సమావేశంలో కూడా వైస్‌ చైర్మన్‌కు ఆహ్వానం ఇవ్వకపోవడంపై కమిషనర్‌ను నిలదీశారు.

Advertisement
 
Advertisement
Advertisement