పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాపై ఆందోళన వద్దు | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాపై ఆందోళన వద్దు

Apr 30 2026 8:37 AM | Updated on Apr 30 2026 8:37 AM

జనగామ: జిల్లాలో డీజిల్‌, పెట్రోల్‌ సరఫరా విషయంలో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్‌ సందీప్‌ కుమర్‌ ఝా అన్నారు. పెట్రోలు, డీజిల్‌ సరఫరాపై బుధవారం కలెక్టరేట్‌లో పెట్రోలియం సంస్థల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ఎనర్జీ కమిటీ సమన్వయ సమావేశాన్ని కలెక్టర్‌ నిర్వహించారు. జిల్లాలో పెట్రోలు, డీజిల్‌ నిల్వలపై తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ తహసీల్దార్‌, పోలీస్‌, లీగల్‌ మెట్రాలాజీ అధికారులు నిరంతరం బంకుల్లో ఉన్న ఇంధన నిల్వలను తనిఖీ చేయాలన్నారు. పెట్రో, డీజిల్‌ను బాటిళ్లు, క్యాన్లలో పోయడంతో వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ బెన్‌ షాలోమ్‌, ఆర్డీఓలు గోపీరామ్‌, వెంకన్న, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్‌ గౌడ్‌, సివిల్‌ సప్లయీస్‌ డీఏం హతీరామ్‌, లీగల్‌ మెట్రాలాజీ అధికారి ఝాన్సీ, డీఎంహెచ్‌ఓ మల్లికార్జునరావు ఉన్నారు.

మే డేను విజయవంతం చేయాలి

మే డే కార్మిక దినోత్సవాన్ని జిల్లా సమీకృత కలెక్టర్‌ కార్యాలయంలోని మెయిన్‌ హాల్లో ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. మే 2 నుంచి 10వ తేదీ వరకు మేడే వారోత్సవాలను జిల్లాలోని ప్రతి మండలంలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో చేపట్టాలని సూచించారు. కార్మిక వారోత్సవాల కమిటీ చైర్మన్‌ సందీప్‌ కుమార్‌ ఝా అధ్యక్షతన వేడుకలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మే డే ఉత్సవాల్లో ఉత్తమ నిర్వహణ, ఉత్తమ అధికారిని సన్మానించాలన్నారు. సమీక్షలో జిల్లా కార్మిక శాఖ అధికారి కుమారస్వామి, జిల్లా ఉపాధి అధికారి రవికాంత్‌, ఐటీఐ ప్రిన్సిపాల్‌, వివిధ కార్మిక సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.

ఎంపీ లాడ్స్‌ నిధులు వినియోగించుకోవాలి

ఎంపీ లాడ్స్‌ నిధుల ద్వారా మంజూరైన పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఎంపీ లాడ్స్‌ పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పనులకు సంబంధించిన పురోగతిపై చర్చించి దిశానిర్దేశం చేశారు. సీసీ రోడ్లు, పాఠశాలల మరమ్మతులు, వీధి దీపాలు, మరుగుదొడ్లు, ఆర్‌ఓ ప్లాంట్లు, విద్యుత్‌, కమ్యూనిటీ హాల్‌ వంటి అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. సమీక్షలో సీపీఓ చినకోట్యా నాయక్‌, ఈఈ పీఆర్‌ శ్రీనివాసరావు, మిషన్‌ భగీరథ ఈఈ(ఇంట్రా) శ్రీకాంత్‌, పలువురు ఎంపీడీఓలు, జనగామ మున్సిపల్‌ మేనేజర్‌ రాములు, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

Advertisement
 
Advertisement
Advertisement