రైతుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

రైతుల సమస్యలు పరిష్కరించాలి

Apr 30 2026 8:37 AM | Updated on Apr 30 2026 8:37 AM

కలెక్టరేట్‌ ఎదుట రైతుసంఘం ధర్నా

జనగామ రూరల్‌: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్‌ డిమాండ్‌ చేశారు. రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వినతి అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ధాన్యం ఎగుమతికి లారీలను తరలించాలని, ధాన్యం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న జాప్యాన్ని అరికట్టాలని కోరారు. గన్నీ సంచుల కొరత తీవ్రంగా ఉందని సహకార సంఘాలకు కొత్త గన్నీ బ్యాగులు ఇవ్వాలన్నారు. తరుగు పేరుతో రైతుల ధాన్యం, మిల్లర్ల కట్టింగును నియంత్రించాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య, గొర్ల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి కన్నెబోయిన బాలరాజు, గానుగుపహాడ్‌ ఉపసర్పంచ్‌ కుర్ర శంకర్‌ నాయక్‌, పెద్ద తండా ఉపసర్పంచ్‌ గోగులోతు ఝాన్సీరాజు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

అంత్యపుష్కరాలను

విజయవంతం చేయాలి

మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్‌బాబు

కాళేశ్వరం: సరస్వతీ నది అంత్యపుష్కరాలను అధి కారులు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మే 21 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు జరుగే సరస్వతీనది అంత్యపుష్కరాల నిర్వహణకు సంబంధించి బుధవారం హైదరాబాద్‌లో అంబేడ్కర్‌ సచివాలయంలో మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంత్య పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్‌ రాహుల్‌ శర్మ మంత్రులకు వివరించారు. పుష్కరాల నిర్వహణలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు, భద్రతా చర్యలు, రవాణా, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు మాట్లాడుతూ అంత్య పుష్కరాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున చేపట్టిన ఏర్పాట్లును త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం సరస్వతీ అంత్య పుష్కరాల వాల్‌ పోస్టర్‌, పుష్కరాల టీజర్‌ను విడుదల చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement