● డిప్యూటీ సీఈఓ పద్మావతి
జనగామ: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా జిల్లాలో ఓటరు మ్యాపింగ్ శాతాన్ని పెంచాలని డిప్యూటీ సీఈఓ పద్మావతి పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ సీఈఓ కార్యాలయం నుంచి జిల్లాకు వచ్చిన డిప్యూటీ సీఈఓ పద్మావతి.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ పురోగతిపై కలెక్టరేట్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని అన్‌మ్యాప్డ్ ఎలక్టోరల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విస్త్రృతంగా మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఇందులో భాగంగా ప్రతీ ఇంటికి వెళ్లి వివరాలను సేకరించాలని, వలసదారుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని తెలిపారు. బీఎల్‌ఓల ద్వారా ఫారం–7 ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. డబుల్ మ్యాపింగ్ వంటి సమస్యలను గుర్తించి, పరిష్కారంలో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. ఈ మేరకు నిర్దేశిత సమయంలోగా మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసి, త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మ్యాపింగ్ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. అనంతరం రెవెన్యూ అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ మండల స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి వెంటనే సమర్పించాలని అధికారులకు ఆదేశించారు. సమీక్ష సమావేశంలో ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీధర్, తహసీల్దార్లు, అధికారులు, పాల్గొన్నారు.


