పల్లెల్లో పబ్లిక్‌ స్కూల్స్‌! | - | Sakshi
Sakshi News home page

పల్లెల్లో పబ్లిక్‌ స్కూల్స్‌!

Apr 29 2026 7:30 AM | Updated on Apr 29 2026 7:30 AM

జనగామ: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్థాయిలో అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్ల(టీపీఎస్‌) ఏర్పాటును వేగవంతం చేస్తోంది. 2026–27 విద్యా సంవత్సరానికి (ఓఆర్‌ఆర్‌) పరిధికి వెలుపల ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో (టీపీఎస్‌)లను ఏర్పాటు చేయాలన్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ నిర్ణయం గ్రామీణ ప్రాంతాల విద్యాభివృద్ధికి కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మూడు పాఠశాలలను ఎంపిక చేశారు.

డేటా ఆధారిత ఎంపిక..

పాఠశాలల ఎంపికను సాధారణ పరిపాలనా నిర్ణయంగా కాకుండా డేటా ఆధారంగా చేపట్టడం ఈ ప్రక్రియలో ప్రత్యేకత. మండల స్థాయి నుంచి పాఠశాలల మౌలిక వసతులు, విద్యార్థుల సంఖ్య, భవనాల స్థితి, ఉపాధ్యాయుల లభ్యత వంటి అంశాలను సేకరించారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో ప్రతిపాదనలను విశ్లేషించి, దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేసింది.

నియోజకవర్గాల వారీగా ఎంపిక

ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక పాఠశాలను ఎంపిక చేయడం ద్వారా ప్రాంతీయ సమతౌల్యాన్ని కాపాడే ప్రయత్నం కనిపిస్తోంది. నర్మెటలో మోడల్‌ స్కూల్‌, చిల్పూరులో పీఎంశ్రీ మల్కాపూర్‌ ఉన్నత, కొడకండ్లలో ఉన్నత పాఠశాల ఎంపిక కాగా, ఇవి భౌగోళికంగా, విద్యార్థుల అవసరాల పరంగా కీలక కేంద్రాలుగా ఉన్నాయి. ఈ ఎంపికతో సమీప గ్రామాల విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్య అందుబాటులోకి రావడం సాధ్యమవుతుంది.

ఆరుట్ల మోడల్‌..నాణ్యతకు ప్రమాణం

ఇప్పటికే రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ఆరుట్ల తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ నమూనాను అనుసరించడం ద్వారా టీపీఎస్‌లకు ఒక స్థిరమైన ప్రమాణం లభిస్తోంది. ఈ మోడల్‌లో ఆధునిక తరగతి గదులు, డిజిటల్‌ బోధన, ఇంగ్లిష్‌ మీడియం, నైపుణ్యాభివృద్ధి ప్రధానంగా ఉంటాయి. అదే విధానాన్ని జిల్లాలో అమలు చేస్తే విద్యార్థుల సామర్థ్యాలు పెరగడంతో పాటు పోటీ పరీక్షల్లో కూడా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు పెరుగుతాయి.

గ్రామీణ విద్యార్థులకు కొత్త అవకాశాలు

ఈ ప్రణాళిక అమలు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులు మెరుగైన వసతులు, నాణ్యమైన బోధన పొందే అవకాశం ఉంది. ఇప్పటివరకు ప్రైవేట్‌ పాఠశాలల వైపు మొగ్గుచూపుతున్న తల్లిదండ్రులు, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలపైనా విశ్వాసం పెంచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం లేకపోలేదు. మౌలిక వసతుల అభివృద్ధికి తగిన నిధులు, నాణ్యమైన ఉపాధ్యాయుల నియామకం, నిరంతర పర్యవేక్షణ వంటి అంశాలు ఇందులో కీలకంగా మారనున్నాయి. తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ విస్తరణ చర్యలు రాష్ట్ర విద్యారంగంలో ఒక పెద్ద సంస్కరణగా నిలిచే అవకాశముంది. టీపీఎస్‌లో 1,000 మంది విద్యార్థుల సామర్థ్యం కలిగి ఉంటుందని తెలుస్తుంది. ఇందులో ప్రీ ప్రైమరీ(ఎన్‌కేజీ, యూకేజీ), ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, 11, 12వ తరగతులు ఉంటాయి, సైన్స్‌ ల్యాబ్‌, ఆట స్థలం, క్రీడా సామగ్రి, కొరత లేని టీచర్లు, ల్యాబ్స్‌, పూర్తి స్థాయిలో ఇన్‌ఫాస్ట్రక్చర్‌, మినరల్‌ వాటర్‌, కిచెన్‌షెడ్‌, డైనింగ్‌ హాల్‌, అదనపు తరగతి గదులు, కొత్త భవనాల నిర్మాణం కోసం నిధులు రానున్నాయి. దూర ప్రాంతాల పాఠశాలలు విలీనం చేస్తే విద్యార్థులకు బస్సు సౌకర్యం కూడా కల్పించే అవకాశం ఉంది. ఈపాఠశాలల్లో ఎన్ని పాఠశాలలను విలీనం చేస్తారనే పక్కా సమాచారం త్వరలో వెలువరించనున్నారు.

కార్పొరేట్‌ తలదన్నేలా ఏర్పాటు

చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం

జిల్లాలో మూడు నియోజకవర్గాలకు.. మూడు పాఠశాలలు

నర్మెట, కొడకండ్ల, చిల్పూరు

మండలాలకు సువర్ణావకాశం

విద్యారంగ సంస్కరణల్లో కీలక అడుగు

కొడకండ్ల ఉన్నత పాఠశాల

పాఠశాల విద్యార్థుల సంఖ్య: 118

ప్రస్తుతం పాఠశాల విస్తీర్ణం: (పక్కనున్న

ప్రైమరీ స్కూల్‌ కలుపుకుంటే) 4 ఎకరాలు

ప్రస్తుతం పాఠశాలలో ఉన్న గదుల సంఖ్య: 24

నర్మెట మోడల్‌ ఉన్నత పాఠశాల

విద్యార్థుల సంఖ్య:600

ప్రస్తుతం పాఠశాల విస్తీర్ణం: 6ఎకరాలు

మల్కాపూర్‌ ఉన్నత పాఠశాల

విద్యార్థుల సంఖ్య: 195

ప్రస్తుతం పాఠశాల విస్తీర్ణం:3ఎకరాలు

Advertisement
 
Advertisement
Advertisement