రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌ పోటీలకు ఎంపిక

Apr 29 2026 7:30 AM | Updated on Apr 29 2026 7:30 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి జెడ్పీఎస్‌ఎస్‌కు చెందిన ఏడుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం కె.రమేశ్‌, పీడీ కొండ రవి తెలిపారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు..ఇటీవల జిల్లాకేంద్రంలో జరిగిన జిల్లాస్థాయి బేస్‌బాల్‌ క్రీడల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ఎంపిౖకైన వారిలో గుగులోతు మధుసూదన్‌(10వ తరగతి), 9వ తరగతికి చెందిన సుంకరి రుత్విక్‌, నునావత్‌ చింటు, కొమ్మరాయల చరణ్‌, 8వ తరగతి నుంచి గుర్రం నాని, ఏడో తరగతికి చెందిన గుర్రం అనిరుధ్‌, గుర్రం చెర్రీ ఉన్నారన్నారు. రాష్ట్రస్థాయి ఈనెల 29, 30వ తేదీల్లో నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో జరుగుతాయని తెలిపారు. విద్యార్థులను హెచ్‌ఎం, పీడీతో పాటు పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ చైర్‌పర్సన్‌ రాధిక, పూర్వ విద్యార్థుల కమిటీ అధ్యక్షుడు జొన్నల రాజేశ్వర్‌, యంజాల ప్రభాకర్‌, ఎన్‌.వెంకట్రాంనర్సయ్య తదితరులు అభినందించారు.

లోటస్‌ హాస్పిటల్‌

స్కానింగ్‌ యంత్రం సీజ్‌

జనగామ: పట్టణంలోని లోటస్‌ హాస్పిటల్‌కు సంబంధించిన స్కానింగ్‌ యంత్రాన్ని అధికారులు సీజ్‌ చేసినట్లు తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య సమర్పించిన దర్యాప్తు నివేదిక ఆధారంగా పీసీపీఎన్‌డీటీ చట్టం ఉల్లంఘనలకు సంబంధించి ఈ చర్య తీసుకున్నట్లు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా వెల్లడించారు. పీసీపీఎన్‌డీటీ రిజిస్ట్రేషన్‌ను తక్షణమే సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందులో పీసీపీఎన్‌డీటీ సర్టి ఫికెట్‌ వివరాలు, ఇన్వాయిస్‌ చిరునామాలతో సరిపోలకపోవడం, ఇన్‌స్పెక్షన్‌ చెక్‌లిస్ట్‌లో తేదీ, సమయం ఖాళీగా ఉండడం, డీఎల్‌ఏఏ కమిటీ నిమిషాలు ఫైల్‌లో లభ్యం కాని పరిస్థితి, అల్ట్రాసౌండ్‌ యంత్రానికి సంబంధించి బీఎండబ్ల్యూ సేవా సర్టిఫికెట్‌ గడువు ముగిసినా కూడా పునరుద్ధరించినట్లు చూపించడంతోనే సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు. సస్పెన్షన్‌ అమల్లో ఉన్న సమయంలో ఎటువంటి ప్రీ నాటల్‌ డయాగ్నస్టిక్‌ విధులు నిర్వహించరాదని ఆదేశించారు. అలాగే ఆల్ట్రాసౌండ్‌ యంత్రాన్ని వినియోగించరాదన్నారు. హాస్పిటల్‌ సస్పెండ్‌ చేసిన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ను 3 రోజుల్లో అధికారులకు అప్పగించాలని సూచనలు చేశారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే సెక్షన్‌ 23 ప్రకారం ప్రాసిక్యూషన్‌కు గురి కావాల్సి ఉంటుందన్నారు. లింగనిర్ధారణ వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలను నిరోధించడంలో అన్ని వర్గాల ప్రజలు సహకరించాలన్నారు.

కనులపండువగా అష్టదళ పాద పద్మారాధన పూజ

చిల్పూరు: చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేదమంత్రాల నడుమ స్వామివారికి అష్టదళ పాద పద్మారాధన పూజ నిర్వహించారు. ఆలయ చైర్మన్‌ శ్రీధర్‌రావు, ఈఓ లక్ష్మీప్రసన్న, జూనియర్‌ అసిస్టెంట్‌ మోహన్‌, మంచిక సరిత–అరుణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement