స్టాక్‌ ఉండి నో స్టాక్‌ బోర్డు పెడితే చర్యలు | - | Sakshi
Sakshi News home page

స్టాక్‌ ఉండి నో స్టాక్‌ బోర్డు పెడితే చర్యలు

Apr 29 2026 7:30 AM | Updated on Apr 29 2026 7:30 AM

పెట్రోలు బంకులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయండి

అధికారులకు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశం

జనగామ: జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ నిర్వహణపై అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశించారు. మంగళవారం ఆయా శాఖల అధికారులతో పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలపై కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పెట్రోల్‌, డీజిల్‌పై ప్రజలు అపోహలకు గురి కావొద్దన్నారు. సాధారణ అవసరాలకు మాత్రమే ఇంధనం కొనుగోలు చేయాలని, అధికారులు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని సూచించారు. జిల్లాలో ఉన్న బంకుల్లో తహసీల్దార్‌, సివిల్‌ సప్లై, పోలీస్‌, తూనికలు కొలతల శాఖల అధికారు లు జాయింట్‌ యాక్షన్‌ కమిటీలుగా బంకుల్లోని పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలను తరుచూ చెక్‌ చేయాలన్నారు. ఒక వేళ బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ ఉన్నప్పటికీ స్టాక్‌ లేదని బోర్డు కనిపిస్తే, సదరు యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఉంటే టోల్‌ ఫ్రీ నెంబర్‌–1800 425 00 333 లేదా రాష్ట్ర విపత్తుల హెల్ప్‌లైన్‌ 1077కు సమాచారం ఇవ్వాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ బెన్‌ షాలోమ్‌, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఆర్డీఓలు గోపిరామ్‌, వెంకన్న, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్‌ గౌడ్‌, వ్యవసాయ, ఆరోగ్య, విద్య, వైద్య, సంక్షేమ శాఖల అధికారులు, పెట్రోల్‌ బంక్‌ డీలర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement