న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుపై
● ఏడాది రికార్డుల పరిశీలన
● రిజిస్ట్రేషన్లు, కమీషన్లపై ఆరా
● తప్పుడు ఆధార్ రిజిస్ట్రేషన్‌పై విచారణ..?
● చనిపోయిన వ్యక్తి పేరుపై రిజిస్ట్రేషన్ చేయడంపై ఆశ్చర్యం..!
● సమగ్ర విచారణతో నిజాలు వెలుగులోకి
● షెట్టర్లు క్లోజ్ చేసి డాక్యుమెంట్ రైటర్ల పరారీ
● రొటీన్‌లో భాగమే విచారణ.. : ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు
జనగామ: జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ఆకస్మిక తనిఖీలు సంచలనంగా మారాయి. సోమవారం జరిగిన ఈ తనిఖీల్లో సీఐలు గౌతమ్ రెడ్డి, రాకేశ్, తహసీల్దార్ లక్ష్మణ్ తమ బృందంతో కలిసి కార్యాలయంలో ఆరు నెలల నుంచి ఏడాది కాలంగా జరిగిన రిజి స్ట్రేషన్ డాక్యుమెంట్లను ఒక్కొక్కటిగా క్షుణ్ణంగా పరిశీలించారు. రెండు గంటలకుపైగా సబ్ రిజిస్ట్రార్ చాంబర్‌లో ప్రతీ డాక్యుమెంట్‌ను పరిశీలిస్తూ రికార్డులను వెరిఫికేషన్ చేశారు.
ఒక్కొక్కరిగా విచారణ
కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు పలువురు డాక్యుమెంట్ రైటర్లను పిలిపించి రోజువారీ రిజిస్ట్రేషన్లు, తీసుకునే ఫీజులు, కమీషన్లపై విచారణ జరిపినట్లు సమాచారం. రోజు ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.. ఎవరెవరికీ ఎంత మొత్తంలో డబ్బులు ఇస్తున్నారు.. అనే అంశాలపై ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. స్టాంప్ డ్యూటీ చెల్లింపులు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయా లేదా అనే విషయంపై కూడా అధికారులు ఆరా తీశారు. ఇటీవల తప్పుడు ఆధార్ కార్డు ఆధారంగా జరిగిన ఒక రిజిస్ట్రేషన్‌న్‌పై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం పలు ముఖ్యమైన డాక్యుమెంట్లు, రిజిస్టర్ లను అధికారులు తమ వెంట తీసుకెళ్లడం ప్రాధాన్యం గమ నార్హం. ఈ తనిఖీలపై సీఐ రాకేశ్ మాట్లాడుతూ.. ఇది ప్రొటోకాల్‌లో భాగంగానే నిర్వహించిన తనిఖీ అని, తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు. అయితే కొన్ని డాక్యుమెంట్లను పరిశీలన కోసం తీసుకెళ్లినట్లు, పూర్తి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. సబ్ రిజిస్ట్రార్ దీపక్ మాట్లాడుతూ.. ఈ తనిఖీలు సాధారణ ప్రక్రియలో భాగమని, ఎలాంటి ఫిర్యాదులు లేవని తనకు తెలిపారని చెప్పారు. ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఉన్న రికార్డులను పరిశీలించి కొన్ని పత్రాలను అధికారులు తీసుకెళ్లినట్లు ఆయన స్పష్టం చేశారు.
మరణించిన వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసిన ఘటనపై..
12 సంవత్సరాల క్రితం మరణించిన వ్యక్తికి సంబంధించిన ప్లాట్‌ను అతడు ఇంకా బతికే ఉన్నట్టు ఆధార్ కార్డులో మార్పులు చేసి రిజిస్ట్రేషన్ చేసిన ఘటన ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డు మార్ఫింగ్‌కు బాధ్యులు ఎవరు,? కార్యాలయంలో ఇలాంటి మరిన్ని అక్రమాలు జరిగాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై కలెక్టర్‌తో పాటు సంబంధిత ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం. మరణించిన వ్యక్తిని జీవించి ఉన్నట్టుగా చూపిస్తూ రిజిస్ట్రేషన్ సమయంలో లింక్ డాక్యుమెంట్లను సరిగా పరిశీలించకుండా నమోదు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐదు రోజులుగా ఈ ఘటనపై చర్చ కొనసాగుతుండగా, ఇందులో కీలక పాత్రధారులు బయటపడకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ప్రైవేట్ వ్యక్తులు, డాక్యుమెంట్ రైటర్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ ఇలాంటి రిజిస్ట్రేషన్లలో పైరవీలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆధార్ మార్ఫింగ్ చేసి రిజిస్ట్రేషన్ జరిగిందంటే వ్యవస్థలో లోపాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థమవుతోందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. సమగ్ర విచారణ జరిపితే ఈ మార్ఫింగ్ వెనుక ఉన్న సూత్రధారులు బయటపడడమే కాకుండా, ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్లు ఇంకా ఎన్ని ఉన్నాయో కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని వారు అంటున్నారు. కొద్ది నెలలుగా ఓ వ్యక్తి అంతా తానే అయినట్టు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అంతా చక్కబెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. సదరు వ్యక్తి ఆధార్ మార్ఫింగ్ చేశారా లేక దీని వెనక ఇంకా పెద్దలు ఎవరైనా అనే దానిపై ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
జనగామ
సబ్ రిజిస్ట్రార్
కార్యాలయం


