విన్నపాలు వినవలె! | - | Sakshi
Sakshi News home page

విన్నపాలు వినవలె!

Apr 28 2026 8:05 AM | Updated on Apr 28 2026 8:05 AM

ప్రజావాణికి వినతుల వెల్లువ

247 అర్జీలు స్వీకరించిన అధికారులు

సమస్యలు విని పరిష్కారానికి

ఆదేశించిన కలెక్టర్‌

జనగామ రూరల్‌: వివిధ సమస్యలతో కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌కు సోమవారం ప్రజలు పోటెత్తారు. ‘నడవలేని స్థితిలో ఉన్నాను మూడు చక్రాల స్కూటీ ఇవ్వాలని ఓ దివ్యాంగుడు.. అక్రమంగా పట్టా చేసుకున్నారని ఓ బాధితుడు.. గుంతల రోడ్డుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు..’ ఇలా పలు సమస్యలను పరిష్కరించాలని అధికారులకు అర్జీలు సమర్పించారు. వీరి నుంచి కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌ ఇతర అధికారులు 247 వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిష్కరించేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, డీఆర్‌డీఓ నూరుద్దీన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ మల్లికార్జునరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

వినతుల్లో కొన్ని ఇలా..

● బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామం చెందిన వై.పద్మ, తనకు పెంకుటిల్లు ఉందని, ఆ ఇల్లు శిథిలావస్థలో ఉందని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు.

● ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేస్తే ఆధార్‌లో పేరు సరిగా లేదని మంజూరు కాలేదని, తనకు ఇల్లు ఇప్పించాలని స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం రంగరాయిగూడెం చెందిన నెలమంచ సుమలత వినతి అందజేశారు.

● దేవరుప్పుల మండలం చిన్నమడూరు గ్రామానికి చెందిన సోమయ్య తన ఇంటి అనుమతులు రావడం లేదని, అధికారులు పరిశీలించి ఇంటి నంబర్‌ కేటాయించాలని అర్జీ పెట్టుకున్నారు.

● ప్రభుత్వం గతంలో దళితులకు సాగు నిమిత్తం 5 ఎకరాల 15 గుంటల భూమి కేటాయించిందని, ఆ భూమిని అక్రమంగా సాగు చేస్తున్నారని, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామం చెందిన మేకల భిక్షపతి అర్జీ అందించారు.

● తనకు గతంలో ఎయిడ్స్‌ వచ్చిందని, వృద్ధాప్య పింఛన్‌ వస్తోందని, తనకు ఎలాంటి ఆధారం లేదని తనకు రూ. 4వేల పింఛన్‌ అందించాలని జనగామ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వృద్ధురాలు వేడుకుంది.

● రఘునాథపల్లి మండలం నుంచి కంచన్‌పల్లి వరకు ఉన్న రోడ్డు సరిగా లేక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, హ్యామ్‌ రోడ్ల కింద అభివృద్ధి చేయాలని గ్రామానికి చెందిన ఆమ్‌ ఆద్మీ పార్టీ కుత్బుల్లాపూర్‌ ఇన్‌చార్జ్‌ నర్సింగోజు వివేకానంద కలెక్టర్‌ వినతి పత్రం అందించారు.

కాలువ పనులు పూర్తి చేయాలి

జనగామ మండలంలోని చీటకోడూర్‌ రిజర్వాయర్‌ నుంచి మెయిన్‌ కెనాల్‌ ద్వారా 2008లో జనగామ, శామీర్‌పేట, బాణాపురం, ఎల్లంల, పెంబర్తి, శ్రీనివాసపురం, టంగుటూర్‌, పటేల్‌గూడెం, బండ్లగూడెం వరకు 15 కిలోమీటర్ల కోసం కాలువ నిర్మాణం అయ్యిందని, ఇందులో 14 కిలోమీటర్లు పూర్తి కాగా మరో కిలోమీటర్‌ శామీర్‌పేట వద్ద నిలిచిపోయిందని జనగామ మండలం శామీర్‌పేట రైతులు వాపోయారు. దీంతో సాగునీరు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, పెండింగ్‌ పనులు వెంటనే పూర్తిచేసి ఆదుకోవాలని కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు.

మూడు చక్రాల స్కూటీ అందించండి..

నాకు చిన్నతనంలోనే పోలియో వచ్చింది. ప్రమాదవశాత్తు కుడి కాలు పూర్తిగా కోల్పోయాను. నడవలేని స్థితిలో ఉంటూ పింఛన్‌తో కాలం వెల్లదిస్తున్నాను. ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చే మూడు చక్రాల స్కూటీకి గతేడాది దరఖాస్తు చేసుకున్నాను. అఽధికారుల సమక్షంలో డ్రా పద్ధతిలో స్కూటీ వచ్చింది. నాలుగు రోజుల తర్వాత డ్రా పద్ధతి చెల్లదని ఇవ్వడం లేదు. కలెక్టర్‌ చొరవ తీసుకోని స్కూటీ మంజూరు చేయాలి.

–కంకల రాజమల్లయ్య, 22వ వార్డు, జనగామ

Advertisement
 
Advertisement
Advertisement