జనగామ: జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంలో మరింత బలోపేతం చేసేందుకు టీపీసీసీ దిశానిర్దేశం చేసింది. సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ అధ్యక్షతన భువనగిరి పార్లమెంట్ పరిధిలో నిర్వహించిన ‘సంఘటన్ సృజన్ అభియాన్’ రివ్యూ మీటింగ్‌కు ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్యఅతిథిగా హాజరు కాగా, జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ధన్వంతిలక్ష్మినారాయణ నాయక్ పాల్గొన్నారు. ఇందులో పార్టీ బలో పేతం, బూత్ స్థాయి నిర్మాణం, మండల, విలేజ్ కమిటీల కార్యక్రమాలపై మార్గదర్శనం చేశారు. సంఘటన్ సృజన్ అభియాన్ ద్వారా పార్టీని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేయాలని వారు పిలుపునిచ్చినట్లు డీసీసీ అధ్యక్షురాలు తెలిపారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఫర్టిలైజర్ షాపుల బంద్ విజయవంతం
జనగామ: జిల్లాలో ఆల్‌ఇండియా, స్టేట్ అసోసియేషన్ పిలుపు మేరకు ఎరువులు, పురుగుల మందులు, విత్తన(ఫర్టిలైజర్స్) దుకాణాల బంద్ సోమవారం విజయవంతమైంది. ఫ్లెక్సీలతో వ్యాపారులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఫర్టిలైజర్స్ అసోసియేషన్ ప్రతినిధి పజ్జూరి గోపయ్య మాట్లాడుతూ.. యూరియా కంపెనీలు అనేక లింకుల సాకుతో ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. యూరియా సరఫరా చేసే సమయంలో రవాణా (ఎఫ్‌ఓఎల్) చార్జీలను తమపైనే మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు ప్రొడక్ట్ కొనుగోలు చేసే సమయంలో లింకు పేరుతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం లింకు ఉండరాదని స్పష్టంగా చెబుతున్నా, కంపెనీలు పట్టించుకోవడం లేదన్నారు. తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకుని, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి
జనగామ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే నిధులను విడుదల చేయాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రావుల తిరుమల్‌రెడ్డి అన్నారు. సోమవారం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాకు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..విద్యార్థుల ఫీజు బకాయిలను విడుదల చేయకపోవడంతో పైతరగతులకు వెళ్లడానికి, అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న వారికి ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. ముఖ్యమంత్రి గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి ఫీజు బకాయిలు వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చి రెండున్నర ఏళ్లు దాటినా నిధులు చెల్లించలేదన్నారు. కార్యక్రమంలో నాయకులు కందుకూరి ప్రభాకర్, ఉల్లెంగుల సందీప్, ఇరుగు యాకన్న, పోశాల పవన్ గౌడ్, దండు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
30న జాబ్ మేళా
విద్యారణ్యపురి: హనుమకొండ అంబేడ్కర్ విగ్రహం ప్రాంతంలోని ఐసీఎస్‌ఎస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్‌లో ఈనెల 30న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు డీఐఈఓ గోపాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26లో 75 శాతం ఉత్తీర్ణతతో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన బీపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఒకేషనల్ (కంప్యూటర్ సైన్స్) విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్థులు వేతనంతోపాటు ప్రముఖ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సులు కూడా చేయవచ్చని తెలిపారు. 30న ఉదయం 11:30 గంటలకు జాబ్‌మేళాలో విద్యార్థులు పాల్గొనాలని ఆయన కోరారు.


