జనగామ: జిల్లా వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ కొరత తీవ్రమైంది. జిల్లాలో 97 బంకులు ఉండగా 80శాతం మేర ప్రాంతాల్లో పెట్రోలు, డీజిల్ కొరత వేధిస్తోంది. జనగామ పట్టణంతో పాటు మండలంలోని వడ్లకొండ, పెంబర్తి, యశ్వంతాపూర్ ప్రాంతాల్లో ఉన్న 14 బంకుల్లో 13 చోట్ల ఇంధనం పూర్తిగా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క జనగామ ఆర్టీసీ చౌరస్తా వద్ద ఉన్న బంకులో మాత్రమే కొంత పెట్రోలు అందుబాటులో ఉండడంతో సోమవారం వందలాది వాహనాలు క్యూ కట్టాయి. నాలుగు రోజులుగా ఈ పరిస్థితి కొనసాగుతుండగా, ఎప్పటికప్పుడు ఇంధనం సరఫరా అయ్యే అవకాశం ఉంటే వెంటనే బంకుల వద్ద వాహనదారులు గుమికూడుతున్నారు. డీజిల్ కొరత ముఖ్యంగా వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం వరి కోతలు జరుగుతున్న నేపథ్యంలో హార్వెస్టర్లకు డీజిల్ అత్యవసరం కాగా, సరఫరా లేక పనులు నిలిచిపోతున్నాయి. అదేవిధంగా ఆటో, ట్రాక్టర్, లారీ, క్యాబ్ డ్రైవర్లు తమ వృత్తిని కొనసాగించలేక ఆర్థికంగా నష్టపోతున్నారు. బచ్చన్నపేట, కొడకండ్ల, జఫర్‌గఢ్, చిల్పూరు, రఘునాథపల్లి, స్టేషన్ ఘన్‌పూర్, దేవరుప్పుల, పాలకుర్తి, నర్మెట మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు వెలిశాయి. జిల్లాలో రోజుకు లక్షల లీటర్ల పెట్రోలు, మూడున్నర లక్షల డీజిల్ వినియోగం ఉండగా, కంపెనీల నుంచి సరిపడా సరఫరా లేకపోవడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని బంకు నిర్వాహకులు చెబుతున్నారు.
డీజిల్ దొరక్కపోవడంతో నిలిచిపోతున్న వ్యవసాయ పనులు
జిల్లాలో 80శాతానికి పైగా బంకుల్లో
నో స్టాక్
దొరికిన చోట వాహనాల బారులు..


