● వంద శాతం హాజరుతో
అక్కాచెల్లెళ్ల ఆదర్శం
● అభినందనలు తెలిపిన విద్యాశాఖ
డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్
నర్మెట: ప్రస్తుత రోజుల్లో బడికి బంకు కొట్టే విద్యార్థులే ఎక్కువ..ఏ చిన్న ఫంక్షనో, అనారోగ్యమో వచ్చిందంటే చాలు బ్యాగు అటకెక్కించడమే.. కానీ ఈ చిన్నారి అక్కాచెల్లెళ్లు గత రెండేళ్లుగా వంద శాతం హాజరుతో ఆదర్శంగా నిలుస్తున్నారు. మండలంలోని మాన్సింగ్‌తండా ప్రాథమిక పాఠశాలలో అక్కాచెల్లెళ్లు పార్వతి, రితిక 5, 4వ తరగతులు చదువుతున్నారు. వీరు వరుసగా రెండో ఏడాది (2024–25, 2025–26) సైతం పాఠశాలకు 100 శాతం హాజరు కావడం విశేషం. వరుసగా రెండు విద్యాసంవత్సరాలు 100 శాతం హాజరు నమోదు కావడం రికార్డని విద్యాశాఖ అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, అడిషనల్ డైరెక్టర్ లింగయ్య విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించారని కాంప్లెక్స్ హెచ్‌ఎం నీలం వేణు తెలిపారు. ఈమేరకు చిన్నారులను సోమవారం ఉపాధ్యాయులు సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రావుల రామ్మోహన్ రెడ్డి, పి. దామోదర్, సిబ్బంది పాల్గొన్నారు.


