అతివలే అధికం | - | Sakshi
Sakshi News home page

అతివలే అధికం

Apr 26 2026 2:51 AM | Updated on Apr 26 2026 2:51 AM

‘ఉపాధి’లో జిల్లాలో 70 శాతం పనులు వారివే..

కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్న మహిళలు

జిల్లా వ్యాప్తంగా 1.16లక్షల జాబ్‌ కార్డులు

కూలీలు 2,24,000

ఈ ఫొటోని మహిళ జఫర్‌గఢ్‌ మండలం వడ్డెగూడెం గ్రామానికి చెందిన పిన్నింటి రాజమ్మ. పురుషులకు దీటుగా పనులు చేస్తూ కూలి పొందుతుంది. కుటుంబ పోషణలో తన భాగస్వామ్యాన్ని చాటుతోంది. ఉదయం ఇంట్లో వంట పనులు చేసుకుని 7 గంటలకే ఉపాధి పనుల్లో నిమగ్నమవుతోంది. ఇలా రాజమ్మ ఒక్కరే కాదు జిల్లాలో చాలా మంది మహిళలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు.

జనగామ రూరల్‌: ఉపాధి పనుల్లో మహిళలు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళలు నేడు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. పలుగు, పార చేతబట్టి ఉపాధి హామీ పథకంలో పురుషులతో సమానంగా పనిచేస్తున్నారు. కుటుంబ పోషణకు ఆసరాగా నిలుస్తున్నారు. పొలం పనులతో పాటు గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి పనులను సద్వినియోగం చేసుకుంటున్నారు. అసంఘటిత రంగంలోనూ సత్తాచాటుతున్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉపాధి పనుల్లో భాగస్వాములవుతున్నారు. జిల్లాలో మొత్తం 70 శాతం వరకు వారే పనులు చేపడుతున్నారు.

ఉపాధి పనులు సద్వినియోగం

ఉన్న ఊరిలో పని దొరకక వలస వెళ్తున్న గ్రామీణ ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వగ్రామంలోనే పనులు కల్పించాలనే లక్ష్యంతో ఉపాధి పథకాన్ని ప్రారంభించాయి. ఈ పథకం పేదలు, వలస జీవులకు వరంగా మారింది. మహిళలు కుటుంబ పనులు చేయడమే కాకుండా పురుషులకు సమానంగా ఉదయం 7 గంటలకే ఇంటి పని ముగించుకుని ఉపాధి బాటపడుతున్నారు. పురుషుల కంటే మహిళలే ఉపాధి పనిని సద్వినియోగం చేసుకుంటున్నారు. కొంత మంది పేద మహిళలు ఉపాధి పనులతో ఆర్థిక సమస్యలను అధిగమిస్తూనే తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తూ ఆర్థికంగా ఆదుకుంటున్నారు. వ్యవసాయ పనులు ఉన్నా ఉపాధి పనికే మొగ్గు చూపడం విశేషం.

పనుల ప్రాధాన్యం ఇలా..

చెక్‌ డ్యాంలు, ఫీడర్‌ చానల్స్‌, మట్టి కట్టలు, గ్యావెల్‌ రోడ్డులు, పండ్లతోటల పెంపకాలు, ఊట గుంటలు, చెరువులు, కుంటల్లో పూడికతీత పనులు, కట్టుకాల్వల పనులు చేపట్టనున్నారు. ఈసారి భూగర్భ జలాలు పెంచేలా నీటి నిల్వ గుంతలు, పంట కాల్వలు, మట్టి దారులు, కందకాల తవ్వకాలు, పశువుల పాకల నిర్మాణాలకు ఇందిరమ్మ ఇళ్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నార ు.

వంద రోజుల పని కల్పించేలా..

పథకంలో భాగస్వాములైన కూలీలందరికీ ఆర్థిక సంవత్సరంలో వంద రోజుల పని కల్పించేలా అధికారులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా గ్రామాలకు అవసరమైన పనులు గుర్తించడంతో పాటు ఇందులో పనులకయ్యే ఖర్చు వివరాలు తయారు చేసి అందజేశారు. కోరిన వెంటనే జాబ్‌కార్డు ఇచ్చి ఉపాధి అందేలా చూస్తున్నారు.

మొత్తం జాబ్‌ కార్డులు : 1,16,000

మొత్తం ఉపాధి కూలీలు : 2, 24,000

ఆక్టీవ్‌ జాబ్‌ కార్డులు : 76,727

ఆక్టీవ్‌ కూలీల సంఖ్య : 1,14,000

Advertisement
 
Advertisement
Advertisement