జనగామ: ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవడంతో మూడు రోజులుగా కొనసాగిన సమ్మెకు తెరపడింది. శుక్రవారం అర్ధరాత్రి సమ్మె విరమణ ప్రకటించగా, శనివారం తెల్లవారు జాము 5 గంటల నుంచే జనగామ బస్టాండ్ నుంచి బస్సు సర్వీసులు యథావిధిగా రోడ్లపైకి వచ్చాయి. మూడు రోజుల పాటు రవాణా సేవలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు ఈ పరిణామంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. జనగామ డిపో పరిధిలో 115 బస్సులు ఉన్నాయి. ఇందులో ఎక్స్‌ప్రెస్ 26, డీలక్స్ 13, పల్లె వెలుగు 37, అద్దె బస్సులు 39 ఉన్నాయి. ఈ బస్సులు ప్రతిరోజూ హనుమకొండ, ఉప్పల్, జగద్గిరిగుట్ట, సికింద్రాబాద్, పాలకుర్తి, సూర్యాపేట, మోత్కూరు, సిద్దిపేట, తదితర ప్రాంతాలకు రోజుకు 385 ట్రిప్పులు తిరుగుతాయి. రోజువారీగా సుమారు 45 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ 56 నుంచి 58 వేల మంది ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుస్తాయి.
కార్మికుడి మృతితో..
మొదటి రెండు రోజుల్లో కొంతమేర బస్సులు నడిచినా, నర్సంపేటకు చెందిన కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్యతో పరిస్థితి మరింత విషమించింది. దీంతో మూడోరోజు పూర్తిగా బస్సులు నిలిచిపోయేలా చేసింది. ఫలితంగా సంస్థకు రోజుకు రావాల్సిన సుమారు రూ.23 లక్షల టికెట్ ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. మూడు రోజుల్లో కలిపి దాదాపు రూ.60 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. సమ్మె విరమణ అనంతరం డిపో మేనేజర్ స్వాతి ఆధ్వర్యంలో అధికారులు, సూపర్‌వైజర్లు అత్యవసరంగా చర్యలు చేపట్టారు. మొదటి రోజే అన్ని బ స్సులను రూట్లపైకి తీసుకొచ్చేలా చర్యలు తీసు కున్నారు. అయినప్పటికీ సమ్మె ప్రభావం వెంటనే తగ్గలేదని గణాంకాలు సూచిస్తున్నాయి. సాధారణంగా 56 నుంచి 58 వేల మంది ప్రయాణించే చోట, సమ్మె తర్వాత తొలి రోజున కేవలం 48 వేల మంది మాత్రమే ప్రయాణించారు. అంటే దాదాపు 10 వేల మంది ప్రయాణికులు తగ్గినట్లు స్పష్టమవుతోంది. ఇది ప్రజల్లో ఇంకా కొంత అనిశ్చితి ఉండడంతోనే తగ్గుదలకు కారణమని అధికారులు భావిస్తున్నారు.
ఆర్టీసీ సమ్మె విరమణ
3 రోజుల సమ్మె, రూ.60లక్షల నష్టం


