
పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్
జనగామ: సర్కారు బడులకు పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్. వేసవి సెలవులు ముగిసిన వెంటనే... అడ్మిషన్ల ప్రారంభం నుంచే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం వేసవిసెలవులు కొనసాగుతున్న నేపధ్యంలో.. జూన్ 12వ తేదీ నుంచి బడులు పునఃప్రారంభం కానున్నాయి. అంతకు ముందే జిల్లాల వారీగా విద్యాశాఖ విద్యార్థుల సంఖ్య ఆధారంగా నివేదికలను పంపించగా, ప్రభుత్వం దాని ఆధారంగా పాఠ్యపుస్తకాలను జిల్లాకు పంపించింది. గత పది రోజుల క్రితమే జిల్లాకు పుస్తకాలు చేరకోగా... డీఈఓ భోజన్న ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయుల సమక్షంలో స్కూల్స్‌కు అందజేస్తున్నారు.
మొదటి విడతలో 81 శాతం..
జిల్లాలో ప్రభుత్వ, లోకల్ బాడీ, గురుకులాలు కలుపుకుని 558 విద్యా సంస్థలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక 341, ప్రాథమికోన్నత 64, ఉన్నత 103, మోడల్ 8, కేజీబీవీ 12, యూఆర్‌ఎస్ 1, ఎయిడెడ్ 10, రెసిడెన్షియల్ 19 ఉండగా.. 45 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. బడిబాట కార్యక్రమంతో పాటు రెగ్యులర్‌గా వచ్చే కొత్త అడ్మిషన్లతో 10 నుంచి 20 శాతం మేర విద్యార్థుల సంఖ్య పెరగనుంది. 1వ తరగతి నుంచి 10 వరకు జిల్లాకు 2,14,460 పాఠ్యప్తుస్తకాలు (తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ) అవసరం ఉండగా, ఇప్పటి వరకు 1,73,730 (81శాతం) వచ్చాయి. వీటిని వీవర్స్ కాలనీ ఓల్డ్ డీఈఓ కార్యాలయ గోదాంలో నిల్వ చేశారు.
ప్రైవేట్‌కు దీటుగా..
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా రెండు జతల యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్నం భోజనం తదితర వాటిని ప్రభుత్వ విద్యార్థులకు ప్రోత్సాహంగా అందిస్తోంది. ప్రైవేట్‌కు దీటుగా డిజిటల్ తరగతులు, సైన్స్ ప్రయోగాలతో ఉత్తమ బోధన చేస్తూ పేద విద్యార్థుల జీవితాలకు బంగారు భవిష్యత్‌ను అందిస్తుంది. ప్రస్తుతం 81శాతం మేర పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుగా, బడులు పునఃప్రారంభమయ్యే లోపు మిగతా 19 శాత పాఠ్యపుస్తకాలను కూడా రానున్నాయి. పాఠశాలలు తెరుచుకున్న తర్వాత విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఒకవేళ పుస్తకాల సంఖ్య తక్కువగా ఉంటే... పై తగతులకు వెళ్లే పిల్లల నుంచి తీసుకుని వాటిని అందించేలా ప్లాన్ చేస్తున్నారు.
పాఠశాలలకు పంపిణీ
2025–26 నూతన విద్యా సంవత్సరానికి గాను సర్కారు బడుల పిల్లలకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలను జిల్లాలో పలు మండలాల ఎమ్మార్సీ కార్యాలయాలకు పంపించారు. జనగామ మండలం(28,645), బచ్చన్నపేట (10,570), నర్మెట (7,77 6), దేవరుప్పుల (7,385) మొత్తంగా 54,376 రకాల పుస్తకాలను మండలాలకు పంపించారు. ఇంకా 8 మండలాలకు 1,19,354 పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంది. ఎమ్మార్సీల నుంచి విద్యార్థుల ఇండెంట్ ప్రకారం పాఠ్యపుస్తకాలను ప్రధానోపాధ్యాయులకు అప్పగించనున్నారు.
జిల్లాలో విద్యాసంస్థల వివరాలు
పీఎస్ 341
యూపీఎస్ 64
ఉన్నత 103
గురుకులాలు 19
కేజీబీవీ 12
యూఆర్‌ఎస్ 01
మోడల్ 8
ఎయిడెడ్ 10
జిల్లాకు 2.14 లక్షలు అవసరం
ఇప్పటివరకు చేరుకున్నవి 1.73 లక్షలు
రెండో విడతలో వందశాతం
155 స్కూల్స్, గురుకులాలు
45 వేల మంది విద్యార్థులు
రెండో విడతలో పూర్తిస్థాయిలో..
సర్కారు బడులు, గురుకులాల పిల్లలకు ఉచితంగా అందించే ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను మండలాల వారీగా పంపిణీ చేస్తున్నాం. ఇప్పటివరకు నాలుగు మండలాలకు 54,376 పుస్తకాలను అందించాం. జిల్లాకు ప్రభుత్వం నుంచి 81 శాతం మేర పాఠ్యపుస్తకాలు రాగా, రెండో విడుతలో పూర్తి స్థాయిగా రానున్నాయి.
– భోజన్న, డీఈఓ

పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్

పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్

పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్