
‘భూ భారతి’ని సద్వినియోగం చేసుకోవాలి
స్టేషన్‌ఘన్‌పూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా అన్నారు. సోమవారం పైలట్ మండలం స్టేషన్‌ఘన్‌పూర్‌లోని కొత్తపల్లి, విశ్వనాథపురం గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో భాగంగా దరఖాస్తుదారులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం రెవెన్యూ అధికారులకు సదస్సుల నిర్వహణ, దరఖాస్తుల స్వీకరణ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఈ నెల 13వ తేదీ వరకు సదస్సులు నిర్వహిస్తామని, రైతులు భూ సమస్యలను తగిన ఆధారాలతో సమర్పించాలన్నారు. దరఖాస్తు చేసుకున్న రైతులకు రశీదులు అందిస్తారన్నారు. మొదట పైలట్ ప్రాజెక్టుగా స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో పూర్తి చేసి ఇక్కడి ఫీడ్ బ్యాక్‌తో జూన్ మొదటివారంలో జిల్లావ్యాప్తంగా చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్‌నాయక్, ఆర్డీఓ వెంకన్న, తహసీల్దార్లు, డీటీలు, ఆర్‌ఐలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తేమశాతం రాగానే కొనుగోళ్లు చేసి వెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా అన్నారు. ఘన్‌పూర్ డివిజన్ కేంద్రం, మండలంలోని విశ్వనాథపురంలోని ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా కొనుగోలు కేంద్రాల్లో నిర్వహిస్తున్న రిజిస్టర్లను పరిశీలించారు. రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని, ఓపీఎంఎస్‌లో కొనుగోళ్ల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్‌నాయక్, తదితరులు ఉన్నారు.
కొత్తపల్లి, విశ్వనాథపురంలో సదస్సులను పరిశీలించిన కలెక్టర్ రిజ్వాన్ బాషా