
జనగామకు తాగునీరందించాలి
జనగామ: నియోజకవర్గంలో ఆగిపోయిన దేవాదుల పెండింగ్ పనులు పూర్తి చేసి జనగామకు తాగునీరు అందించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కోరారు. శనివారం దేవన్నపేట పంపుహౌస్ వద్ద దేవాదుల మూడో దశ పనులను పరిశీలించిన అనంతరం మంత్రులను కలిసిన వినతిపత్రం అందజేశారు. మల్లన్నసాగర్ నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తీసుకువచ్చే పనులు 25 శాతం పూర్తయ్యాయని, మొత్తం పూర్తి చేస్తే ధర్మసాగర్ నుంచి గండిరామారం మీదుగా తపాస్‌పల్లి వెళ్లే భారాన్ని తగ్గించడమే కాకుండా స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి ప్రాంతాలకు కూడా నీరు ఎక్కువగా విడుదల చేసే అవకాశం ఉంటుందన్నారు. బచ్చన్నపేట, చేర్యాల ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న కెనాల్ పనులు రెండేళ్లుగా నిలిచి పోయాయని, భూసేకరణ సమయంలో కొంతమంది రైతులకు పరిహారం అందజేయగా.. మిగతావారి కారణంగా పనులు నిలిచిపోయినట్లు చెప్పారు. అలాగే జనగామ మండలం చీటకోడూరు డ్యామ్‌కు గోదావరి జలాలను మళ్లించి పట్టణానికి సరపడా తాగునీరు అందించాలని కోరారు. తరిగొప్పుల, చిల్పూరు, వేలేరు మండలాలకు సంబంధించి లిఫ్ట్ పనులు వెంటనే పూర్తి చేయాలని కోరారు.
మంత్రులు ఉత్తమ్, పొంగులేటికి ఎమ్మెల్యే ‘పల్లా’ విజ్ఞప్తి