భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలి
పారిశుద్ధ్య పనుల్లో అలసత్వం వద్దు
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
సరస్వతి నది పుష్కరాల పనులపై అధికారులతో సమావేశం
కాళేశ్వరం: ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు జరిగే సరస్వతి నది పుష్కరాల పనుల్లో మరింత వేగం పెంచాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరేలతో కలిసి పుష్కరాల పనులను పరిశీలించారు. ముందుగా త్రివేణిసంగమం వద్ద వీఐపీ (జ్ఞాన సరస్వతి) ఘాటు వద్ద నిర్మిస్తున్న సరస్వతి మాత విగ్రహం, ఘాటు విస్తరణ పనులు, మరుగుదొడ్లు, శ్రాద్ధమండపం నిర్మాణాలను పరిశీలించారు. మంత్రికి ఎస్పీ వీఐపీ ఘాటుకు వచ్చే రోడ్డు మ్యాపును వివరించారు.
గోదావరిలో నీటిమట్టం పుష్కరాల నాటికి తగ్గుతుందా? అని ఇరిగేషన్‌శాఖ ఈఈ తిరుపతిరావును అడుగ్గా కొంత తగ్గుతుందని, అయితే భక్తులకు ఇబ్బంది లేదన్నారు. సరస్వతిమాత విగ్రహం బేస్ కింద రివిట్‌మెంట్ కరెక్ట్ ఉందా అని ఎండోమెంట్ ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. వీఐపీ ఘాటు వద్ద టెంట్‌సిటీ నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ఇక్కడ టెంట్‌సిటీని మొదటిసారిగా ఏర్పాటు చేస్తున్నామని, జాయ్‌రైడ్స్ కోసం కన్నెపల్లి వద్ద కాకుండా దేవస్థానం లేదా ఘాటు పరిసరాల్లో మూడు హెలిపాడ్‌లు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్‌కు తెలిపారు.
పారిశుద్ధ్యంపై దృష్టి సారించండి
పుష్కరాలకు వచ్చే భక్తులకు అందంగా కనిపించాలని, వ్యర్థాలు, చెత్తచెదారం లేకుండా పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మీ, ఎంపీడీఓ వెంకటేశ్వర్లుకు ఆదేశించారు. పుష్కరాల్లో పారిశుద్ధ్యం పెద్దపీట వేస్తుందని, ఎక్కువ సంఖ్యలో కూలీలను పెంచాలన్నారు. అలాగే ప్రధాన ఘాటు నుంచి వీఐపీ ఘాటు వరకు గోదావరిలో బండరాళ్ల తొలగించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. మళ్లీ పుష్కరాల పనులు పరిశీలించేందుకు నిత్యం వస్తుంటానని, అధికారులు అందుబాటులో ఉంటూ పనులు పూర్తి చేయించాలన్నారు.
అలాగే గోదావరిలో బోట్లు తిప్పేందుకు అనుమతి ఇవ్వాలని, మరిన్ని బోట్లు పెంచి గంగపుత్రులకు ఉపాధి కల్పించాలన్నారు. అనంతరం హరితహోటల్‌లో శాఖల వారీగా సమీక్ష చేశారు. మంత్రి వెంట సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్, ఈఓ మహేష్, డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, సీఐ రామచందర్‌రావు, ఎస్సై తమాషారెడ్డి, నాయకులు కోట రాజబాపు, మాజీ ఎంపీపీ రాణిబాయి, అశోక్, శ్రీనివాసరెడ్డి, ఎల్.రాజబాపు, శకీల్, సత్యనారాయణ, జానీ, శ్యాందేవుడా తదితరులు పాల్గొన్నారు.