వదలరు.. కదలరు.. | - | Sakshi
Sakshi News home page

వదలరు.. కదలరు..

May 4 2026 7:19 AM | Updated on May 4 2026 7:19 AM

జగిత్యాల: ఆ పది మంది ఎస్సైలు జిల్లాను వదలరు.. వారంతా ఒకే బ్యాచ్‌ వాళ్లు.. పదేళ్ల క్రితం జిల్లాలో పోస్టింగ్‌ పొంది.. అప్పటి నుంచి ఇక్కడి నుంచి వెళ్లేది లేదని భీష్మించుకుని తిష్ట వేశారు. నేతల ప్రాపకం ఉత్తర, దక్షిణ జిమ్మిక్కులతో సదరు ఎస్సైలు జిల్లాను వదలడం లేదన్న వాదనలు ఉన్నాయి. శ్రీవదల బొమ్మాళీ.. వదలశ్రీ అన్న రీతిలో ఆ బ్యాచ్‌ ఎస్సైలు ఖో ఖో అడినట్లు వాళ్లల్లో వాళ్లే ఒకరి నుంచి ఒకరికి ఖో ఇచ్చుకుని పోస్టింగ్‌లకు మారిపోవడం ఆనవాయితీగా మారింది. ప్రస్తుతం ఒకే బ్యాచ్‌కు చెందిన పది మంది ఎస్సైలు జిల్లాలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

వదలరు.. కదలరు

జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి పోలీస్‌ సర్కిళ్లు ఉన్నాయి. వాటి పరిధిలో 22 మంది ఎస్సైలు ఉన్నారు. వీరు కాక.. స్పెషల్‌ బ్రాంచ్‌, ఇంటలిజెన్స్‌, సీసీఎస్‌ వారిని పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 30 మంది వరకు ఎస్సైలు ఉన్నారు. వీరిలో కనీసం పదిమంది ఒకే బ్యాచ్‌కు చెందిన వారు ఉండడం గమనార్హం. సదరు బ్యాచ్‌ ఎస్సైలు లూప్‌లైన్లలో పనిచేయడానికి అసలే ఇష్టపడరు. పదేళ్లుగా జగిత్యాల, మల్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్‌పల్లి వంటి కీలక ప్రాంతాల్లో ఉంటున్నారు. రెండవ శ్రేణి పోస్టింగ్‌లుగా చెప్పుకునే రాయికల్‌, కథలాపూర్‌, మేడిపల్లి, మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం, పెగడపల్లి, జగిత్యాల రూరల్‌ వంటి పోలీస్‌స్టేషన్లలోనూ ఒకరి తరువాత ఒకరు వారే ఎక్కువ కాలం పనిచేశారు. ఇతర బ్యాచ్‌లకు చెందిన ఎస్సైలు ఎవరైనా జిల్లాకు వస్తే వారిని కుదురుకోకుండా చేయడంలోనూ వీరిది అందెవేసిన చేయిగా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ప్రచారం ఉంది. ఈ అంశం ఇటీవల కాలంలో జిల్లా పోలీస్‌ శాఖలో చర్చనీయంగా మారింది.

ఉత్తర, దక్షిణల్లో దిట్టలు

అధికార పార్టీ నేతల ప్రాపకం పొందడంలో సదరు బ్యాచ్‌ ఎస్సైలకు వెన్నతో విద్యగా చెప్పుకుంటారు. ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల అధికార పార్టీ కీలక నేతలను ఆకట్టుకుని వారి ఉత్తరాలతో పోలీసు ఉన్నతాధికారులను ఎప్పటికప్పుడు ప్రసన్నం చేసుకుంటున్నారు. జిల్లాలో ఆదాయ వనరులు పుష్కలంగా ఉన్న కీలక ఠాణాల్లో పోస్టింగ్‌ల కోసం కొంతమంది ఆ బ్యాచ్‌ ఎస్సైలు అవసరమైతే శ్రీదక్షిణశ్రీ మంత్రం వేసి మరీ దస్తీలు వేసుకుంటున్న వైనం విస్మయం కలిగిస్తోంది. ఇంతలా జిల్లాను వదలకుండా కొంతమంది ఎస్సైలు ఏకధాటిగా ఇక్కడే పనిచేస్తున్న వైనం ఇటీవల కాలంలో ఉన్నతాధికారుల దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఈ విషయంలో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఉన్నతాధికారులు లోతుగా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. బాసర జోన్‌ వ్యాప్తంగా అదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాలకు ఎస్సైలు బదిలీ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఆర్థికంగా బలంగా ఉన్న జిల్లాను సదరు బ్యాచ్‌ ఎస్సైలు వదలడం లేదు. దీని వెనక ఆంతర్యం ఏమిటన్న అంశం ఉన్నతాధికారులకు అంతు చిక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

పదేళ్లుగా ఇక్కడే ఓ పోలీస్‌ బ్యాచ్‌

జిల్లాలో పది మంది తిష్ట

ఉత్తర, దక్షిణ జిమ్మిక్కులు

Advertisement
 
Advertisement
Advertisement