జగిత్యాలటౌన్: ఉద్యోగులు, నిరుద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై బీజేపీ అసెంబ్లీ లోపల, వెలుపల ఎంత నిలదీసినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మోదీ సభ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. కేంద్రం జిల్లాకు కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేస్తే స్థలం కేటాయించలేని దుస్థితిలో ఉండటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. అధికారంలోకి రాకముందు బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని, కేసీఆర్‌ను చర్లపెల్లి జైలులో పెడతానని ఇప్పుడు ఫాంహౌజే కేసీఆర్‌కు జైలులాంటిదనడం వారిద్దరి బంధానికి నిదర్శనమని పేర్కొన్నారు. హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్‌పై విశ్వాసం కోల్పోయిన రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, తెలంగాణకు దిశానిర్దేశం చేసేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్నారని తెలిపారు. ఈనెల 10న సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించే సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యురాలు భోగ శ్రావణి, జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, నాయకులు సురేందర్‌రెడ్డి, అనూప్‌రావు, పూదరి అరుణ, వడ్డెపల్లి శ్రీనివాస్, నలువాల తిరుపతి, సుంకెట దశరథరెడ్డి, భూమి రమణ, జుంబర్తి దివాకర్ ఉన్నారు.
బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి


