కుక్కలకు కు.ని.
జగిత్యాల: జిల్లాలో ఎక్కడ చూసినా కుక్కలు, కోతుల బెడద విపరీతంగా ఉంది. వాటిని నియంత్రించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కనీస చర్యలు చేపట్టడం లేదు. కుక్కలను నియంత్రించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా పెద్దగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్లపైకి రావాలంటేనే చిన్నారులు, విద్యార్థులు, మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లావ్యాప్తంగా గ్రామాలతో పాటు జగిత్యా ల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి ము న్సిపాల్టీటిల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా జిల్లా కేంద్రంలో కుక్కల బెడద తీవ్రంగా ఉంది.
సెంటర్ ఉన్నా లేనట్లే..
జిల్లా కేంద్రంలోని టీఆర్‌నగర్‌లో ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. గతంలో కుక్కలకు కు.ని. కోసం పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి హైదరాబాద్‌కు చెందిన ఒక ఏజెన్సీకి అప్పగించారు. వారు 2024 ఆగస్టు 9న కుక్కలను పట్టేందుకు చర్యలు తీసుకున్నారు. కొద్ది రోజుల పాటు కార్యక్రమం చేపట్టగా బిల్లులు సకాలంలో అందకపోవడంతో వారు సుమారు 2 వేల కుక్కలకు మాత్రమే ఆపరేషన్లు చేసినట్లు తెలిసింది. ఒక్కో కుక్కకు రూ.1,450 చొప్పున కేటాయించారు. ఇంకా దాదాపు రూ.9 లక్షలు వారికి ఇవ్వాల్సిందిగా తెలిసింది. వెంటనే బిల్లులు చెల్లించి మళ్లీ కు.ని. ఆపరేషన్లు చేయించి కుక్కల బెడద తొలగించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే కోరుట్ల, మెట్‌పల్లిలోనూ ఈప్రక్రియ చేపట్టాల్సిన అవసరం ఉంది. అక్కడ సైతం కొన్ని కుక్కలకు మాత్రమే చేసి ఆపరేషన్లు చేసి వదిలేశారు. ఆపరేషన్లు చేసినట్లు గుర్తుగా వాటి చెవిని కత్తించారు.
పెరుగుతున్న కుక్క దాడులు
ఈ జనవరిలో నిలిచిపోయిన కుక్కల నియంత్రణ ఆపరేషన్లు మళ్లీ ఇప్పటి వరకు చేపట్టలేదు. దాదాపు 10 నెలలు కావస్తున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించడం లేదు. జిల్లా కేంద్రంలోనే 5–10 వేల వరకు కుక్కలు ఉంటాయని అంచనా. ఏ వార్డులో చూసినా గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. దీంతో ప్రజలు జంకుతున్నారు.
ఉదయం, రాత్రివేళ వెళ్లాలంటే వణుకే..
ఉద్యోగస్తులు, విద్యార్థులు, మహిళలు ఉదయం వారి పనుల నిమిత్తం వెళ్తుంటారు. ముఖ్యంగా బస్టాండ్లు, కళాశాలతో పాటు ప్రతి గల్లీలో కుక్కలు సంచరిస్తున్నాయి. వేకువజామున 4 గంటల సమయంలో జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌కు వెళ్లాలంటే వణికిపోతున్నారు. బస్టాండ్‌తో పాటు పార్క్ సందిలో వందల సంఖ్యలో కుక్కలు ఉంటున్నాయి. అవి అరుస్తూ జనం పైకి దాడులకు తెగబడుతున్నాయి. భయాందోళనతో పరుగెత్తాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. జిల్లా కేంద్రంలోని కొన్ని వార్డుల్లో ఎమర్జెన్సీ సైతం ఏర్పాటు చేశారు.
కరిస్తే ఇబ్బందులే..
కుక్కలను చూస్తేనే భయంకరంగా ఉంటున్నాయి. సొల్లు కారుస్తూ ఒకరకమైన చర్మవ్యాధులతో కన్పిస్తున్నాయి. అలాంటివి కరి స్తే రేబిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కాటు వేసిన కొద్ది రోజులకే తలనొప్పి, కండరాలు బిగుసుకు పోయి అలసటకు గురవుతారని వైద్యులు చెబుతున్నారు. సకాలంలో వైద్యం అందకపోతే మనుషులు చనిపోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కల నియంత్రణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
మళ్లీ
ప్రారంభిస్తాం
ప్రస్తుతం కుక్కలకు కు.ని.నిలిచిపోయినప్పటికీ వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. టవర్‌సర్కిల్, కొత్తబస్టాండ్‌తో పాటు, మరికొన్ని ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ఉన్నట్లు తెలిసింది. ఏజెన్సీ వారితో మాట్లాడి ఆపరేషన్లు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం.
– చరణ్, ఏఈ, జగిత్యాల
ఎప్పుడు?
ఎప్పుడు?


