ఇంటర్ లింకింగ్‌తో సమస్యకు చెక్
జగిత్యాలఅగ్రికల్చర్: వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు సబ్ స్టేషన్లలో యుద్ధప్రతిపాదికన ఇంటర్ లింకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోనే ఇంటర్ లింకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో జిల్లా ముందంజలో ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 33/11 కేవీ సబ్‌స్టేషన్లలో 46.. 33 కేవీ లైన్లలో 23.. అలాగే 11 కేవీ లైన్లలో 117 ఇంటర్ లింకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.
ఇంటర్ లింకింగ్ వ్యవస్థ అంటే..
ఇంటర్ లింకింగ్ వ్యవస్థలో ఒక సబ్‌స్టేషన్ నుంచి మరో సబ్‌స్టేషన్‌కు ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ఏదైనా కారణంతో ఇప్పటి వరకు ఉన్న లైను పనిచేయకుంటే ప్రత్యామ్నాయంగా కొత్తగా వేసిన లైను ద్వారా విద్యుత్ సరఫరా చేస్తారు. ఇంటర్ లింకింగ్ వ్యవస్థ లేనప్పుడు విద్యుత్ లైన్లలో ఏదైనా సమస్య వస్తే అది పరిష్కరించే వరకు ఆ లైన్‌లో ఉన్న ప్రాంతాలకు సరఫరా నిలిచిపోయేది. ఇప్పుడు ఇంటర్ లింకింగ్‌తో ఒకట్రెండు నిమిషాల్లోనే అంతరాయం లేకుండా నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తారు. దీంతో దెబ్బతిన్న లైన్ల పనులు సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఉంది. ఇంటర్ లింకింగ్ వ్యవస్థ ప్రకారం..ఒక 33/11 కేవీ సబ్‌స్టేషన్ నుంచి మరో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు, 33/11 కేవీ సబ్‌స్టేషన్ నుంచి మరో 132/33 కేవీ స్టేషన్, 33కేవీ లైన్ నుంచి మరో 33 కేవీ లైన్‌కు ప్రత్యామ్నాయంగా విద్యుత్ సరఫరా జరుగుతుంది.
19,004.66 కి.మీ విద్యుత్ లైన్లు
జిల్లాలో 19,004.66 కి.మీ మేర విద్యుత్ లైన్లు ఉన్నాయి. ఇందులో, 33 కేవీ లైన్లు 672.08 ఉండగా, 11 కేవీ 5,115.51, ఎల్‌టీ లైన్లు 13,217.07 కి.మీ మేర ఉన్నాయి. అలాగే 220/132 కేవీ సబ్‌స్టేషన్ ఒక్కటి, 132/33 కేవీ సబ్‌స్టేషన్లు 8 ఉండగా, 33/11 కేవీ సబ్‌స్టేషన్లు 110, నిర్మాణ దశలో మరో 6 ఉన్నాయి. ఈ సబ్‌స్టేషన్ల పరిధిలో 21,979 ట్రా న్స్‌ఫార్మర్లు ఉన్నాయి. ఇందులో 11 కేవీ ఫీడర్లు 503 ఉండగా, 24 గంటల విద్యుత్ సరఫరా ఉండే వ్యవసాయ ఫీడర్లు 362 ఉన్నాయి. ఈ వ్యవస్థలో ఎక్కడ సమస్య వచ్చినా సరఫరా నిలిచిపోతుంది. దీంతో ఇంటర్ లింకింగ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు.
విద్యుత్ సరఫరాలో వినియోగదారులకు ఇ బ్బందులు రావద్దనే ఉద్దేశంతో ఇంటర్ లింకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. గతంలో మ రమ్మతు పనులు చేసేటప్పుడు విద్యుత్ నిలిపివేసేవాళ్లం. ఇప్పుడు ఇంటర్ లింకింగ్ వ్యవస్థతో సరఫరా నిలిచిపోవడం ఉండదు. ఎప్పటికప్పుడు న్యూ టెక్నాలజీని విద్యుత్ వ్యవస్థకు అనుసంధానిస్తున్నాం. – బి.సుదర్శనం, ఎస్‌ఈ
ఇబ్బందులు రావద్దని..


