
ప్రణాళికతో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి
జగిత్యాల: ఖరీఫ్ పంట ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలగినివ్వొద్దని, కేంద్రాల్లో వసతులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత రెండు సీజన్లలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిగాయని, ఈసారి కూడా పక్కా ప్రణాళికతో కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. వానాకాలం సంబంధించి జిల్లాలో 3.15 లక్షల ఎకరాల్లో వరి సాగు అయిందని, 7.50–8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు వస్తుందని అంచనా వేయడం జరిగిందన్నారు. మద్దతు ధర క్వింటాల్‌కు గ్రేడ్–ఏ రకానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369, బోనస్ క్వింటాల్‌కు రూ.500 చెల్లించడం జరుగుతుందన్నారు. ప్రతి కేంద్రంలో రిజిస్టర్లు, ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ యంత్రాలు, టార్పాలిన్ తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. ఏ రోజు వచ్చిన ధాన్యాన్ని ఆ రోజే కొనుగోలు చేయాలని సూచించారు. అవసరం మేరకు గన్నీ బ్యాగులు ఉంచాలని, హమాలీల కొరత ఉండకూడదని ఆదేశించారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ బీఎస్ లత, డీఆర్డీవో రఘువరణ్, డీఎస్‌వో జితేందర్‌రెడ్డి, జితేంద్రప్రసాద్, ప్రకాశ్, అధికారులు పాల్గొన్నారు.